
పసిడి ధరలు మరోసారి సామాన్యుడితో దోబులాడుతోంది. దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు తగ్గినట్టే తగ్గిన మళ్లీ కొండెక్కుతున్నాయి. ఆగస్టులో అత్యధికంగా రూ.56 వేల మార్కును దాటిన బంగారం ధర క్రమంగా తగ్గుతూ ఒక దశలో రూ.50 వేలకు దిగి చేరుకుంది. కాగా, గత వారం హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటూ ఊగిసలాటల నడుమ కొద్దికొద్దిగా పెరుగుతుంది. దీంతో మరోసారి స్వచ్ఛమైన పసిడి ధర రూ.52 వేలకు చేరువైంది. తాజాగా మంగళవారం ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.454 పెరిగి రూ.51,879 వద్ద ట్రేడ్ అయ్యింది. ఇది హైదరాబాద్, విజయవాడ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 52,680 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఫారెక్స్ మార్కెట్లో అమెరికన్ డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ కొంత బలహీనపడటం కూడా దేశీయంగా బంగారం ధరలు తగ్గడానికి కారణమైందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు చెబుతున్నారు. కాగా, గత ట్రేడ్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.51,425 వద్ద ముగిసింది. ఇక వెండి ధరలు కూడా మంగళవారం స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.751 పెరిగి రూ.63,127కు చేరింది. గత ట్రేడ్‌లో కిలో వెండి రూ.62,376 వద్ద ముగిసింది. అటు అంతర్జాతీయ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1960 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా, వెండి 24.41 డాలర్లు పలికింది. ఇక అంతర్జాతీయ మార్కెట్ తో పోలిస్తే రూపాయి మారక విలువ రూ.73.47గా ఉంది.