Hyderabad: గోల్కొండ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు.. బయటపడిన 400 ఏళ్లనాటి సొరంగం!
హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడమైన గోల్కొండ కోట ప్రాంతంలో అక్రమ తవ్వకాలు కలకలం రేపాయి. గోల్కొండ 18 సీడీ ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరపడాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్, ఆగస్ట్ 21: గోల్కొండ ప్రాంతంలో అక్రమ తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. గోల్కొండ 18 సీడీ ప్రాంతంలోని సుమారు 400 ఏళ్ల నాటి కుతుబ్‌షాహీ సమాధుల ప్రాంగణం, సమీపంలోని క్రీడా మైదానంలో తవ్వకాలు జరుపుతుండగా సొరంగాలు బయటపడటం పెద్ద సంచలనంగా మారింది. అయితే ఈ తవ్వకాల వెనుక అసలు కారణం ఏంటి? ఎవరు తవ్వకాలు చేశారు? అక్కడ బయటపడిన సొరంగం ఎక్కడికి వెళ్తుంది? అన్న ప్రశ్నలు ఆసక్తి రేపుతున్నాయి.
ఈ తవ్వకాల విషయం వెలుగులోకి రావడంతో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ స్పందించారు. AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సూచనల మేరకు ఆయన పురావస్తు శాఖ అధికారులను సంప్రదించి ఘటనపై సమాచారం అందించారు. తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి.. సొరంగం చూసి షాక్‌కు గురయ్యారు. అక్కడ ఏదైనా పురాతన నిర్మాణం ఉందా అనే అంశాలను పరిశీలించేందుకు అధికారులు శనివారం స్థలాన్ని తనిఖీ చేయనున్నట్లు తెలిపారు.
ఈ వ్యవహారాన్ని హైదరాబాద్ కలెక్టర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ దృష్టికి కూడా ఎమ్మెల్యే తీసుకెళ్లారు. ఆ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 400 ఏళ్ల నాటి చారిత్రక ప్రాంతంలో తవ్వకాలు జరగడం, అందులో సొరంగం బయటపడటం ఇప్పుడు అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఈ సొరంగం ఎప్పటిది? దాని నిర్మాణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది? గతంలో దీన్ని ఏదైనా ప్రయోజనం కోసం ఉపయోగించారా? తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా? అన్నదానిపై ASI పరిశీలనతో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
