
గోదావరి ఉగ్రరూపంతో కోనసీమలోని లంక గ్రామాలు జలదిగ్భందనంలో చిక్కుకున్నాయి. పెరుగుతున్న గోదావర ఉధృతితో ముంపు గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. గ్రామాలను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.
లోతట్టు ప్రాంతమైన అరిగెలవారిపేట పూర్తిగా నీటి మునిగింది. దీంతో గ్రామస్తులను అధికారులు నాటు పడవలద్వారా పునరావాసకేంద్రానికి తరలిస్తున్నారు. పంటలన్నీ నీటమునిగాయి. ఏటుగట్లు కూడా బలహీనంగా ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
తూర్పుగోదావరి జిల్లాలోని 23 మండలాల పరిధిలోని 146 గ్రామాలను ముంపు భయం వెంటాడుతోంది. ఇందులో చింతూరు, ఎటపాక, వీర్‌పురం, కూనవరం మండలాల్లోని 57 గ్రామాలు నీట మునిగాయి. కాటన్ బ్యారేజీకి దిగువన ఉన్న కోనసీమలోని ముమ్మిడివరం, పి.గన్నవరం, అయినపల్లి, అల్లవరం మండలాల్లో 12గ్రామాలు నీటిలో నానుతున్నాయి.పోలవరం మండలంలో 19 ముంపు గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి పర్యటన అనంతరం సహాయక చర్యలను మరింత వేగవంతం చేశారు అధికారులు. పునరావాస కేంద్రాల్లోని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు స్థానిక ప్రజా ప్రతినిధులు.