Telangana: జంతువును మింగి పత్తి చేనులో తిష్టవేసిన భారీ కొండచిలువ.. కూలీల రాకతో
కూలీలు రోజూలాగే ఉదయాన్నే ఓ రైతు పొలంలో పత్తి తీయడానికి వెళ్లారు. పత్తి తీయడం ప్రారంభించిన కాసేపటికే వారికి పొలంలో ఏదో అలికిడి వినిపించింది. ఆ శబ్దాలు మళ్లీ మళ్లీ రావడంతో ఏంటో అని చూసేందుకు వెళ్లగా అక్కడ ఓ భారీ కొండచిలువ కనిపించింది. అంతే ఒక్కసారిగా భయపడిపోయిన కూలీలు కేకలు వేశారు. ఇక సమాచారంతో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు దాన్ని పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పొలంలో పత్తి తీస్తుండగా కూలీలకు ఓ భారీ కొండచిలువ కనిపించిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. చింతకాని మండలం నేరడ గంగమ్మ గుడి సమీపంలో ఓ రైతుకు చెందిన పత్తి చేనులో కూలీలు పత్తి తీసే పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఇంతలో పొలంలోంచి ఏవో శబ్దాలు రావడంతో ఏంటని చూసేందుకు వెళ్లిన కూలీలకు షాకింగ్ దృశ్యం కనిపించింది. అక్కడ ఓ భారీ కొండచిలువ కంటపడింది. అంతే దాన్ని చూడగానే ఒక్కసారిగా భయపడిపోయిన కూలీలు గట్టిగా కేకలు వేశారు.
ఈ విషయాన్ని వెంటనే పొలం యజమానికి తెలియజేయడంతో అతను గ్రామ సర్పంచ్ దూసరి నేతాజీకి సమాచారం ఇచ్చారు. ఆయన ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సాయంతో భారీ కొండచిలువను ఫారెస్ట్ సిబ్బంది క్షేమంగా పట్టుకున్నారు.
అయితే కొండచిలువ పొట్ట భాగం బాగా ఉబ్బిపోయి కనిపించడంతో అది ఏదో జంతువును మింగేసి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. జంతువును తిన్న తర్వాత కదలలేని పరిస్థితిలో విశ్రాంతి తీసుకునేందుకు చేనులోకి వచ్చి ఉంటుందని ఫారెస్ట్ సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఇక ఆ భారీ కొండచిలువను అధికారులు పట్టుకోవడంతో రైతులతో పాటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
