గ్రేటర్ వాసులకు వార్నింగ్.. ఇకపై చెత్తను ఇష్టానుసారంగా పడేశారో కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైంది జీహెచ్ఎంసీ. బల్దియా ఎన్నికల కారణంగా ఇన్ని రోజులు బిజీగా ఉన్న అధికారులు.. నగరాన్ని క్లీన్ సిటీ గా మార్చడంపై ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో దుకాణాదారులకు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. దుకాణాదారులు చెత్తను ఇష్టారీతిన రోడ్లపై పడేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాదు.. దుకాణాల లైసెన్స్‌లను కూడా రద్దు చేస్తామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. క్లీన్ హైదరాబాద్ చేసేందుకు తాము ప్రయత్నిస్తుంటే.. నగర వాసులు మాత్రం ఇష్టారీతిన వ్యవహరిస్తూ ఎక్కడబడితే అక్కడ చెత్తను వేస్తున్నారని అధికారులు ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పటి వరకు ఎలా ఉన్నా.. ఇకపై మారాల్సిందేనని హూంకరిస్తున్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచిస్తున్నారు. ఒకవేళ చెత్త ఉంటే వాటిని సంచులు, బ్యాగ్‌లలో నిల్వ చేసి చెత్త సేకరణకు వచ్చినప్పుడు ఇవ్వాలని అధికారులు దిశానిర్దేశం చేస్తున్నారు.