గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నేరేడ్‌మెట్ ఎన్నిక ఫలితంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు మరోసారి ఓట్లను లెక్కించిన అదికారులు ఫలితాన్ని ప్రకటించారు. జీహెచ్ఎంసీ న్నికల ఫలితాల్లో నేరెడ్‌మెట్ డివిజన్‌లో టీఆర్ఎస్ విజయం సాధించింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 136వ డివిజన్‌లో 782 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలుపొందారు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలం 56కు చేరింది.
బీజేపీ శ్రేణుల అభ్యంతరంతో నిలిచిపోయిన నేరెడ్‌మెట్ డివిజన్ ఓట్లను లెక్కించేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. బుధవారం ఉదయం 8 గంటలకు ఆ డివిజన్ ఓట్ల లెక్కింపును అధికారులు ప్రారంభించారు. సైనిక్‌పురిలోని భవన్స్ వివేకానంద కాలేజీలో ఓట్ల లెక్కింపు జరిగింది. నేరెడ్‌మెట్ డివిజన్ మొత్తంలో 25,176 ఓట్లు పోలవ్వగా.. 24,632 ఓట్లు లెక్కించారు. డిసెంబర్ 4న లెక్కించిన వాటిలో 504 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. హైకోర్టు తీర్పుతో ఇతర గుర్తులున్న 544 ఓట్లను బుధవారం ఉదయం లెక్కించారు. 544 ఓట్ల లో 278 ఓట్లు టిఆర్ఎస్ పార్టీకి వచ్చాయి.. అనంతరం టీఆర్ఎస్ అభ్యర్థి 782 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.