గ్రేటర్ మహాపోరులో ప్రధాన ఘట్టానికి నేటితో ఎండ్ కార్డ్…ఓటర్లను ఆకర్షించే పనిలో నాయకులు
గ్రేటర్ మహాపోరులో ప్రధాన ఘట్టానికి నేటితో ఎండ్ కార్డ్ పడనుంది. హోరాహోరీగా సాగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి శనివారం తెరపడనుంది. సాయంత్రం ఆరు గంటలతో..
GHMC Election Campaign : గ్రేటర్ మహాపోరులో ప్రధాన ఘట్టానికి నేటితో ఎండ్ కార్డ్ పడనుంది. హోరాహోరీగా సాగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి శనివారం తెరపడనుంది. సాయంత్రం ఆరు గంటలతో క్యాంపెయిన్ ముగుస్తుంది. ఆ తర్వాత ప్రచారం మైక్‌లు మూగబోనున్నాయి.
ప్రచారం నేటితో ముగుస్తుండటంతో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు అన్ని ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి. పార్టీల స్టార్ క్యాంపెయినర్స్ – విస్తృతంగా సభలు, సమావేశాలు, రోడ్ షోల్లో పాల్గొననున్నారు. తమను గెలిపిస్తే… హైదరాబాద్ అభివృద్ధికి ఏం చేయనున్నారో మరోసారి ఏకరువు పెట్టనున్నారు.
గడువు ముగిసిన తర్వాత ప్రచారం నిర్వహిస్తే రెండేళ్ల జైలు లేదా జరిమానా లేదా రెండింటిని విధించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. గడువు ముగిశాక ఎన్నికలకు సంబంధించిన సభలు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించరాదని, టెలివిజన్-సినిమాటోగ్రఫీ ద్వారా ప్రసారాలు చేయరాదని స్పష్టం చేసింది.
గడువు ముగిసిన వెంటనే మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుందని స్టేట్ ఎలక్షన్ కమిషన్ పేర్కొంది. ప్రచార గడువు ముగిశాక.. జీహెచ్‌ఎంసీ పరిధిలో నివాసం లేని, ఓటర్లు కాని వారు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు, ప్రచాకర్తలందరూ వెళ్లిపోవాలని ఆదేశించింది.
డిసెంబరు 1న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. డిసెంబరు 4న కౌంటింగ్ నిర్వహించి, ఫలితాలు ప్రకటిస్తారు.