ఢిల్లీలో ఈ నెల 16 న జరిగిన గ్యాంగ్ వార్ కు కారణాలను పోలీసులు వివరించారు. ద్వారకా మోర్ మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ఈ ఘటనలో గ్యాంగ్ స్టర్స్ వికాస్ దలాల్, ప్రవీణ్ గెహ్లాట్ హతులయ్యారు. పశ్చిమ ఢిల్లీలోని మోహన్ గార్డెన్ వద్ద కోటి రూపాయల విలువైన 600 చదరపు అడుగుల ప్లాటే ఈ షూటవుట్ కి కారణమని పోలీసులు చెప్పారు. బెట్టింగ్ ద్వారా సంపాదించిన డబ్బును పంచుకోవడంలో రెండు ముఠాల మధ్య జరిగిన తగాదా కూడా ఇందుకు కారణమైనట్టు భావిస్తున్నామన్నారు. ఢిల్లీలో నవాడా ఏరియాలో గల తన ఇంటినుంచి బయలుదేరిన గెహ్లాట్ ని క్రిమినల్స్ బైక్ పై వెంబడించారని, తమ సహచరులను క్రైమ్ స్పాట్ వద్దకు పంపారని ఖాకీలు వివరించారు. షూటర్లు మారుతి స్విఫ్ట్ కారులోను, బైక్ పైన వచ్చారని , నేర స్థలానికి కొద్ధి దూరంలో మోటార్ సైకిల్ వదిలేశారని వారు చెప్పారు. ఈ ఘటనలో ఒక క్రిమినల్ ను పోలీసులు కాల్చి చంపారు. మరో ఇద్దరు దుండగులు పారిపోయారు. వారిని నీరజ్, సూర్య అలియాస్ అంకిత్ గా గుర్తించారు.