
గణపతి బప్పా మోరియా… జై బోలో గణేశ్ మహారాజ్ కీ జై… అంటూ భక్త కోటి గణనాధునికి భక్తి ప్రపత్తులతో వీడ్కోలు పలికారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలలో ఉత్సవ మండపాలు, భారీ సెట్టింగ్‌లు, చలువ పందిళ్ళలో కరోనా నిబంధనలు పాటిస్తూ 11 రోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాథుడు అత్యంత వైభవంగా భక్తులచే ఘనంగా వీడ్కోలు పొందాడు.
ఉత్సవ నిర్వాహకులు, భక్త బృందాలు, భక్తులు అట్టహాసంగా గణనాథుని నిమజ్జనోత్సవాన్ని నిర్వహించారు. భక్త బృందాల కేరింతలు, మేళతాళాలు, డప్పు నృత్యాలు, విచిత్ర వేషధారణలు, పుష్ప జల్లులు, కోలాటాలు, భజనలు, కీర్తనలతో గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికారు. రాముడు, కృష్ణుడు, భీముడు ఇతరత్రా విచిత్ర వేషధారణలతో ఈ ఏడాది రాముడి ఆలయ నమూనాలు అధికంగా ఆకట్టుకున్నాయి. ఈ ఏడాది విగ్రహాల ఎత్తు తక్కువగా ఉండటంతో గణపయ్యలను కార్లపై అలకంరిచుకుని నిమజ్జనం కోసం తీసుకొచ్చారు. ఇలా కార్లు ర్యాలీగా రావడం ఈ చాలా ప్రత్యేకంగా అనిపించింది.వీటితోపాటు మాస్కులు ధరించిన వినాయకుడి వాహనాలు ప్రత్యేకంగా కనిపించాయి.
బైక్‌పై శివపార్వతులు గణేషుడు నగరంలో షికారు చేసిన సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయ వస్త్రధారణలతో యువకులు నృత్యాలు చేస్తూ రంగులు చల్లుకుంటూ, కేరింతలు కొడుతూ భక్తి ప్రపత్తులతో నిమజ్జనం చేశారు. అయితే వినాయకుల ఎత్తుపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టడంతో అంతా ఎత్తును తగ్గించడంతోపాటు మట్టి విగ్రహాలను ఏర్పాటు చేశారు.
అంగరంగ వైభవంగా నిర్వహించుకొనే గణపతి నిమజ్జనం కోవిడ్ -19 నిబంధనలతో సాదాసీదాగా సాగింది. భక్తి శ్రద్ధలతో మండపాల నుంచి గణనాథులను గంగమ్మ చెంతకు చేర్చారు.