ఆస్పత్రి పొమ్మంది.. ఉన్న ఊరు కాదంది.. దిక్కుతోచని కరోనా యువకుడు

|

Jun 11, 2020 | 1:20 PM

కొవిడ్ సోకిందన్న అనుమానంతో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తిని చేర్చుకోలేమంటూ వెళ్లగొట్టారు. ఇంటికెళదామంటే.. ఊర్లో అడుగుపెట్టొద్దంటూ గ్రామస్తులు హుకుం జారీ చేశారు. ఏం చేయాలో తెలియక ఆ యువకుడు దిక్కుతోచని స్థితిలో పడ్డాడు.

ఆస్పత్రి పొమ్మంది.. ఉన్న ఊరు కాదంది.. దిక్కుతోచని కరోనా యువకుడు
Follow us on

కరోనా ధాటికి అయినవారిని , ఉన్న ఊరును దూరం చేస్తోంది. కొవిడ్ సోకిందన్న అనుమానంతో ఆస్పత్రికి వచ్చిన వ్యక్తిని చేర్చుకోలేమంటూ వెళ్లగొట్టారు. ఇంటికెళదామంటే.. ఊర్లో అడుగుపెట్టొద్దంటూ గ్రామస్తులు హుకుం జారీ చేశారు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ యువకుడు దిక్కుతోచని స్థితిలో పడ్డాడు.
నాకు కరోనా లక్షణాలున్నాయి.. పరీక్షించండీ బాబు అంటూ నేరుగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి వెళ్లిన ఓ యువకుడిని చేర్చుకునేందుకు నిరాకరించారు. తీరా, జగిత్యాలలోని జిల్లా సర్కారు దవాఖానకు పోతే పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో అక్కడున్న రోగులకు సోకే ప్రమాదం ఉందంటూ హోం ఐసోలేషనుకు వెళ్లాలని అక్కడి డాక్టర్లు పంపించేశారు. ఇంటికెళదామంటే.. ఊర్లో అడుగుపెట్టొద్దంటూ గ్రామస్తులు రానిస్తలేరు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ యువకుడు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నాడు.
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పోరుమల్ల గ్రామానికి చెందిన యువకుడు(23) హైదరాబాద్ లో ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్నాడు. కొద్దిరోజులుగా జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడు. ఎంతకీ తగ్గకపోవడంతో కరోనాగా భావించి నేరుగా గాంధీ ఆస్పత్రికి వెళ్లాడు. నేరుగా వచ్చేవారిని చేర్చుకోలేమంటూ అక్కడి సిబ్బంది వెనక్కి తిప్పి పంపించారు. దీంతో ఈ నెల 8న ఆర్టీసీ బస్సులో జగిత్యాల చేరుకుని.. ఫ్రెండ్ బైకుపై సొంతూరు వెళ్లాడు. సొంతూరులో ఉన్న యువకుడికి జ్వరం తగ్గకపోవడంతో జగిత్యాలలోని జిల్లా దవాఖానకు వెళ్లి ఐసోలేషన్ వింగ్ లో చేరాడు. డాక్టర్లు శాంపిల్స్ తీసి, వరంగల్ పంపించగా బుధవారం పాజిటివ్ గా నిర్ధారించారు. ఐసోలేషన్ వార్డులోనే ఉంటే మిగతా వారికి వైరస్ సోకుతుందని వెంటనే ఇంటికి వెళ్లగొట్టారు జిల్లా వైద్యులు. ఇంటికి ఫోన్ చేస్తే అక్కడికి వచ్చేందుకు ఆ ఊరి పెద్దలతో పాటు కుటుంబసభ్యులు సైతం ససేమిరా అన్నారు. దీంతో ఎం చేయాలో ఎటు పోవాలో తెలియక దిక్కుతోచనిస్థితిలో పడ్డాడు ఆ యువకుడు. అయితే స్నేహితుల సాయంతో ప్రస్తుతం తల దాచుకున్నాడు.
మరోవైపు కరోనా సోకిన యువకుడిని వదిలేసిన రెవెన్యూ ఆఫీసర్లు, పోలీసులు.. ఇప్పుడు అతడి కాంటాక్ట్ అయిన వ్యక్తులపై ఆరా తీస్తున్నారు. వారి వివరాలు సేకరించి హోంక్వారంటైన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే, గాంధీ సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు ఆ గ్రామస్తులు. యువకుడి ఆస్పత్రిలో చేర్చుకునే ఉంటే ఈ ప్రమాదం తప్పేదంటున్నారు.