ఒకే పార్టీలో… ఫోన్ ఆపరేటర్ టూ సెలబ్రిటీ ప్రచారకర్త

|

Sep 25, 2019 | 3:29 PM

తెలుగు తెరపై చెదిరిపోని నవ్వులు పంచిన కమెడియన్ వేణు మాధవ్ ప్రస్థానం ముగిసింది. తెలుగు రాష్ట్రాలలో తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్న వేణు..వారందర్ని శోకసంద్రంలో ముంచి వెళ్లిపోయారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆఫీసు బాయ్‌ నుంచి అదే పార్టీకి సెలబ్రిటీ ప్రచారకర్తగా మారిన వేణుమాధవ్ జీవితం ఎంతోమందికి స్పూర్తిదాయకం సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలో వేణుమాధవ్‌ జన్మించారు. ఆయన తండ్రి ప్రభాకర్‌, తల్లి సావిత్రి. వేణుమాధవ్‌కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే ఇష్టం. ఏ చిన్న సందర్భం […]

ఒకే పార్టీలో... ఫోన్ ఆపరేటర్ టూ సెలబ్రిటీ ప్రచారకర్త
Follow us on

తెలుగు తెరపై చెదిరిపోని నవ్వులు పంచిన కమెడియన్ వేణు మాధవ్ ప్రస్థానం ముగిసింది. తెలుగు రాష్ట్రాలలో తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్న వేణు..వారందర్ని శోకసంద్రంలో ముంచి వెళ్లిపోయారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆఫీసు బాయ్‌ నుంచి అదే పార్టీకి సెలబ్రిటీ ప్రచారకర్తగా మారిన వేణుమాధవ్ జీవితం ఎంతోమందికి స్పూర్తిదాయకం

సూర్యపేట జిల్లా కోదాడ పట్టణంలో వేణుమాధవ్‌ జన్మించారు. ఆయన తండ్రి ప్రభాకర్‌, తల్లి సావిత్రి. వేణుమాధవ్‌కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్‌ అంటే ఇష్టం. ఏ చిన్న సందర్భం వచ్చిన డ్యాన్స్‌ చేసి అందరినీ అలరించేవారట. 4 ఏళ్ల వయసు నుంచే మిమిక్రీలో ఆరితేరారు. చదువుకునే రోజుల్లోనే ఉపాధ్యాయుల్ని అనుకరించి అందరినీ తెగ నవ్వించేవారట.

ఆర్థిక తోడ్పాటు లేకపోవడంతో వేణు హిమాయత్‌నగర్‌లోని టీడీపీ ఆఫీసులో ఫోన్ ఆపరేటర్‌గానూ పనిచేశారు. అయినా తనకు అబ్బిన మిమిక్రీ విద్యను వదిలిపెట్టకుండా పలు ప్రదర్శనలు ఇచ్చారు. రవీంద్రభారతిలో ఓసారి వేణుమాధవ్‌ చేసిన మిమిక్రీ కార్యక్రమాన్ని దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి చూశారు. అందులో ‘ఇడ్లీ, వడలు.. గులగుల జామ్‌లు’ అనే కామెడీ బిట్‌ను చూసి వారు తెగ ఎంజాయ్‌ చేశారట. దీంతో ‘మా తర్వాతి సినిమాలో ఆ పాత్ర చేస్తావా?’ అని వేణు మాధవ్‌ని అడిగారు. ఆ ఒక్క డైలాగ్‌ వేణుమాధవ్‌ జీవితాన్ని మలుపుతిప్పింది. అలా 1996లో ‘సంప్రదాయం’తో సినిమా రంగంలోకి ఆయన ప్రవేశించారు. తొలి సినిమాలోనే బ్రహ్మానందంతో కలిసి పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని వేణుమాధవ్‌ చెప్పేవారు. అప్పటివరకు మిమిక్రీ ప్రోగ్రాంకు రూ.1000 మాత్రమే తీసుకునే వేణుమాధవ్‌కు ఆ సినిమా కోసం రూ.70 వేలు పారితోషికంగా ఇచ్చారు. ఆ సినిమా పూర్తయిన మూడు రోజులకే ‘శ్రీకారం’లో అవకాశం వచ్చింది. అలా వరుస అవకాశాలతో బిజీ అయిపోయారు. అలా స్వశక్తితో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తెలుగుతెరపై తిరుగులేని జైత్రయాత్రను కొనసాగించారు.

‘తమ్ముడు’, ‘ప్రియమైన నీకు’, ‘స్టూడెంట్ నెం.1’, ‘ఆది’, ‘నువ్వే నువ్వే’, ‘దిల్’, ‘సింహాద్రి’, ‘వెంకీ’, ‘ఆర్య’, ‘సాంబ’, ‘గౌరి’, ‘గుడుంబా శంకర్’, ‘సై’, ‘ఛత్రపతి’, ‘బన్నీ’, ‘లక్ష్మి’, ‘జై చిరంజీవ’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘కృష్ణ’, ‘యోగి’ వంటి చిత్రాలు ఆయన్ను కమెడియన్‌గా మరోస్థాయికి తీసుకెళ్లాయి. ‘హంగామా’, ‘భూకైలాష్’, ‘ప్రేమాభిషేకం’ చిత్రాల్లో వేణు హీరోగా నటించారు. తను ఫోన్ ఆపరేటర్‌గా పనిచేసిన టీడీపీ పార్టీకే పలు సందర్భాల్లో సెలబ్రిటీ ప్రచారకర్తగా ఆయన ఎన్నికల ప్రచారం చేశారు. ఆరోగ్యం పరంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వేణుమాధవ్‌కు గత నాలుగేళ్లుగా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. గతకొంతకాలంగా కాలేయ వ్యాధికి  చికిత్స పొందుతోన్న వేణు.. నేటి మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.