ముంబైలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాతబస్తీలాంటి డొంగ్రీ ప్రాంతంలో పురాతన కాలం నాటి నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రాంతంలో ఇలాంటి భవనాలు ఇంకా చాలా ఉన్నాయి. వీటిలో నిత్యం ట్రేడింగ్ జరుగుతూ ఉంటుందని స్థానికులు తెలిపారు. బిల్డింగ్ కూలిన ఘటనలో దాదాపు 51 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్‌ఎఫ్, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిన్నారులు, మహిళలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. బిల్డింగ్ ఫిట్‌నెస్ తగ్గిపోవడంతో పాటు ఇటీవల ముంబైలో భారీగా కురిసిన వర్షాలు కూడా దీనికి కారణమే అని తెలుస్తోంది. బృహన్ ముంబై మున్సిపాలిటీ కార్పొరేషన్ హెచ్చరికలు జారీ చేసినా.. ప్రజలు అక్కడి నుంచి ఖాళీ చేయలేదని తెలుస్తోంది. అయితే ముంబై మున్సిపల్ అధికారులు తమకు సరైన ప్రత్యామ్నాయం చూపించలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డొంగ్రీ ఏరియాలో దాదాపు 200 వందల నుంచి 300 వందల వరకు ఇలాంటి ఫిట్‌నెస్ లేని ఇళ్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ ఘటనలో 12 మంది మరణించారు. ఈ నాలుగంతస్తుల భవనం శిథిలాల కింద మరో 30 మంది చిక్కుకుపోయినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ భవనం దాదాపు 8 దశాబ్దాల నాటిది. గత ఏడేళ్లుగా ఈ భవనం ఓ ప్రయివేటు బిల్డర్ చేతిలో ఉంది.