బట్టల గోదాంలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి, 8మందికి గాయాలు

గుజరాత్ రాష్ట్రంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అహ్మాదాబాద్ వస్త్ర గోదాంలో జరిగిన ప్రమాదంలో నలుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు.

బట్టల గోదాంలో అగ్నిప్రమాదం.. నలుగురు మృతి, 8మందికి గాయాలు

Updated on: Nov 04, 2020 | 7:06 PM

గుజరాత్ రాష్ట్రంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అహ్మాదాబాద్ వస్త్ర గోదాంలో జరిగిన ప్రమాదంలో నలుగురు వ్యక్తులు సజీవదహనమయ్యారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. అహ్మాదాబాద్‌ నగరంలో బుధవారం ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పిప్లాజ్ రోడ్డు నానుకాక ఎస్టేట్‌లోని వస్త్ర గోదాంలో ప్రమాదవశాత్తు మంటలంటుకున్నాయి. దీంతో అగ్నికీలలు గోదాం మొత్తం వ్యాపించాయి. ఒక్కసారిగా గోదాం కుప్పకూలింది. ప్రమాద సమయంలో గోదాంలో 12 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పి శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని చికిత్స నిమిత్తం స్థానిక ఎల్జీ హాస్పటల్‌కు తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో పరిస్థితి విషమించి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మందికి చికిత్స అందిస్తున్నట్లు అగ్నిమాపక అధికారి జయేశ్‌ ఖాడియా తెలిపారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.