
ఆర్థికంగా చితికిపోయిన దంపతులు తనువు చాలించారు. ఆర్థిక భారానికి అనారోగ్య సమస్యలు తోడవ్వడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు ఆ వృద్ధ దంపతులు. నల్లగొండ: జిల్లాలోని మునుగోడులో విషాద ఘటన చోటుచేసుకుంది.
మునుగోడుకు చెందిన సరికొండ సైదులు(68), సరికొండ జానకమ్మ(62) లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయారు. వచ్చే ఆదాయాన్ని కోల్పోయారు. జానకమ్మ గత ఐదు సంవత్సరాలుగా చర్మవ్యాధితో బాధపడుతోంది. అప్పటి నుంచి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అయినప్పటికీ ఫలితం లేకపోగా ఆర్థికంగా చతికిల పడ్డారు. జానకమ్మ వైద్యం కోసం చేసిన అప్పులు తీర్చలేక తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యారు వృద్ధ దంపతులు. ఆర్థిక ఇబ్బందులతో పాటు, ఆనారోగ్యం సమస్యలను భార్యాభర్తలను తీవ్రంగా బాధించాయి. దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని స్థానిక పోలీసులు తెలిపారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఇద్దరినీ నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారని వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.