కరోనాపై తెలంగాణ సమరం.. మంత్రి ఇంఛార్జ్‌గా కమాండ్ కంట్రోల్

పెరిగిపోతున్న కరోనా భయాందోళనలను అరికట్టేందుకు తెలంగాణ మంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. తన సారథ్యంలో కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

కరోనాపై తెలంగాణ సమరం.. మంత్రి ఇంఛార్జ్‌గా కమాండ్ కంట్రోల్

Updated on: Mar 04, 2020 | 6:19 PM

Etala Rajendar to lead command control on Covid-19: పెరిగిపోతున్న కరోనా భయాందోళనలను అరికట్టేందుకు తెలంగాణ మంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. తన సారథ్యంలో కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో నలుగురు ఐఏఎస్ అధికారులుంటారని, ఆ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరానని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ బుధవారం వెల్లడించారు.

కరోనా వైరస్ వ్యాప్తిపై జోరందుకున్న వదంతులకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రయత్నించారు మంత్రి ఈటల. కరోనా పాజిటివ్‌తో కాంటాక్ట్ ఉన్నవాళ్లలో 47 మందికి టెస్ట్ చేశామని, 45 నెగెటివ్ రాగా… ఇద్దరి రిపోర్టులపై స్పష్టత లేకపోవడంతో వాటిని పుణెకు పంపామని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ధారించాకే రిపోర్ట్స్‌ని ఎప్పుడైనా ప్రకటించాల్సి ఉంటుందని, రాష్ట్రంలో ఎవరికి నేరుగా వైరస్ సోక లేదని మంత్రి అంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి మాత్రమే వైరస్ సోకిందని, సోషల్ మీడియాలో అనవసరపు ప్రచారాలు చేయడం సరికాదని మంత్రి అన్నారు.

సమస్య తీవ్రతను అర్ధం చేసుకోవాలన్న మంత్రి… బాధ్యత కలిగిన మీడియా.. వైరస్ ప్రబలకుండా వుండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎక్కువగా ప్రచారం చేయాలని సూచించారు. భయం కలిగించే లాంటి వార్తలను ప్రసారం చేయవద్దని కోరారు మంత్రి ఈటల. ఏదో సాఫ్ట్ వేర్ సంస్థను పూర్తిగా ఖాళీ చేసినట్టు వార్తలు వస్తున్నాయని, అలాంటి చర్యలు అవసరం లేదని చెప్పారాయన. వైరస్ ఉన్న వ్యక్తి తుమ్మినా, దగ్గినా ఆ తుంపరలు నేరుగా ఇతరుల నోట్లోనో, కంట్లోనో పడితేనే వ్యాపిస్తుందన్న విషయాన్ని అందరు గుర్తుంచుకోవాలని చెబుతున్నారు మంత్రి ఈటల.

రాష్ట్రంలోని పెద్ద ప్రైవేట్ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులు వున్న దగ్గర చికిత్సలకు ప్రభుత్వం అనుమతించిందని చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ… టెస్ట్ కోసం నమూనాలను గాంధీకి పంపాల్సి ఉంటుందన్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందించేందుకు ముందుకు వచ్చాయని, వైద్య పరీక్షలకు, చికిత్సలకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి వివరించారు.

కోఠిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, దానిక స్వయంగా తానే సారథ్యం వహిస్తున్నానని చెప్పారు మంత్రి ఈటల. నలుగురు అనుభవఙ్ఞులైన ఐఏఎస్ అధికారులను కేటాయించాలని సీఎస్‌ని కోరామన్నారు. సర్వైలెన్స్ కమిటీ, హాస్పిటల్ మేనేజ్‌మెంట్, ప్రొక్యూర్మెంట్ కమిటీ, ప్రచారం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేసామని, వీటి కోసం ఒక్కో కమిటీకి ఒక ఐఏఎస్ అధికారి కూడా అందుబాటులో ఉంటారని వివరించారు. చాలా రకాల వైరస్‌లతో పోలిస్తే కరోనా ప్రభావం తక్కువని, ఇది ప్రాణాలపై పెద్దగా ప్రభావం చూపదని ఈటల అంటున్నారు.

ఇదీ చదవండి: కరోనాపై చేతులెత్తేసిన గాంధీ డాక్టర్లు! Gandhi hospital doctors expressed inability