తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కారణంగా.. తెలుగు రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజులపాటు జోరుగా వర్షాలు పడనున్నాయి. అరేబియా సముద్రంలో అల్పపీడనంతో.. దక్షిణ చత్తీస్‌గఢ్, ఉత్తర కర్నాటక, తెలంగాణ మీదుగా 2.1 కిలో మీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ తమిళనాడు, ఉత్తర శ్రీలంక, కోమోరిన్ ప్రాంతాల నుంచి ఉత్తర కోస్తాంధ్ర వరకు నైరుతి బంగాళాఖాతం మీదుగా అల్పపీడన ద్రోణి ఆవరించింది.
ఈ ప్రభావంతో రానున్న 48 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాలకు దగ్గరలో నైరుతి బంగాళాఖాతంను ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో కూడా అల్పపీడనం ఏర్పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో అక్కడక్కడ.. ఉరుములు, మెరుపులతో పాటు మోస్తారు వర్షాలు కురుస్తాయని.. అలాగే.. ఏపీలో కూడా.. విస్తారంగా వర్షాలు కురవనున్నాయని.. అధికారులు వెల్లడించారు. కాగా.. పిడుగులతో కూడిన వర్షం రానుందని.. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
కాగా.. ఇప్పటికే నిత్యం కురుస్తోన్న వర్షాలతో ప్రజలు నానా ఇక్కట్లు పడుతోన్న సమయంలో.. వాతావరణ శాఖ భారీ వర్షసూచన ఉందని హెచ్చరించడంతో.. జనం కలవరపడుతున్నారు.