PIA Aeroplane Seized: పాకిస్తాన్‌కు మలేషియా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. చెల్లింపుల వివాదం నేపధ్యంలో పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ)కు చెందిన బోయింగ్ 777 విమానాన్ని టేకాఫ్ కాకముందే కౌలాలంపూర్ ఎయిర్‌పోర్టులో మలేషియన్ ఆథారిటీలు స్వాధీనం చేసుకున్నాయి. అక్కడి స్థానిక కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు సమాచారం. దీనితో ప్రయాణీకులు ఇబ్బంది పడకుండా పీఐఏ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. దౌత్య మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడానికి పాకిస్థాన్ ప్రభుత్వం కోరిందని ట్విట్టర్ ద్వారా స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే 2015లో, పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ -777తో సహా రెండు విమానాలను వియత్నాంకు చెందిన ఓ కంపెనీ నుంచి లీజుకు తీసుకుంది. అయితే అనుకున్న సమయానికి డబ్బులు చెల్లించకపోవడంతో సదరు కంపెనీ కోర్టుకు ఎక్కింది. ఆరు నెలల క్రిందట ఈ అంశంపై యూకే కోర్టులో కేసు దాఖలైనట్లు ఆ సంస్థ ప్రతినిధి వెల్లడించారు. కాగా, గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ ప్రభుత్వం గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటున్న సంగతి తెలిసిందే. దీనితో పాటు పీఐఏ పైలెట్లతో 40 శాతం మంది నకిలీ సర్టిఫికెట్స్ కలిగిన వారని బయటపడటంతో ప్రపంచవ్యాప్తంగా పాకిస్థాన్‌ను గట్టి దెబ్బ తగిలింది.