గత డిసెంబరులో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధుల ఖర్చుల వివరాలపై ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. తెలంగాణాలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 1,821 మంది అభ్యర్ధులు పోటీచేసారు. వీరందరిలో 1,702 మంది ఓటమిపాలయ్యారు. ఇప్పటికి ఆరునెలలు గడుస్తున్నా వీరు ఖర్చుల వివరాలు వెల్లడించలేదు. రూల్స్ ప్రకారం 45 రోజుల్లోగా ఎన్నికల్లో చేసిన ఖర్చులను అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది.
పోటీ చేసిన అభ్యర్ధులు తమ ఖర్చుల వివరాలును ఎన్నికల సంఘం రూపొందించిన విధానంలో సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు స్పందించకపోవడంతో 52 మందికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. నియమాల ప్రకారం మూడు దఫాలు నోటీసులు జారీ చేస్తారు. అప్పటికీ స్పందించకపోతే అలాంటి వారిపై ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు లేకుండా అనర్హత వేటు వేస్తారు.
ఇప్పటివరకు తొలివిడతగా 77 మందికి నోటీసులు సర్వ్ చేశారు. వీరిలో 20 మంది స్పందించి తమ ఖర్చుల వివరాలను అందజేశారు. ఇక వచ్చే నెలలో మరో దఫా నోటీసులు జారీ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధుల వ్యయాల వివరాలు వెల్లడించేందుకు గడువు జూన్ నెలాఖరుతో ముగియనున్నట్టుగా ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించింది.