వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు నాలుగు పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పురపాలకశాఖకు ఎన్నికల సంఘం తాజాగా లేఖ రాసింది. పురపాలక శాఖల పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 15తో ముగియనున్నందున ఆ లోపే ఎన్నికల ప్రక్రియను పూర్తిచేయాలని సూచించింది.
ఎన్నికలకు కీలకమైన వార్డుల/డివిజన్ల పునర్విభజన (డీలిమిటేషన్) పూర్తి చేయాలని కోరింది. రెండు గ్రేటర్ కార్పొరేషన్ల పాలకవర్గాలకు, సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, కొత్తూరు పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వరంగల్, ఖమ్మం, అచ్చంపేట పాలకవర్గాల గడువు మార్చి 15తో ముగియనుండగా సిద్దిపేట పాలకవర్గం గడువు ఏప్రిల్ 16వ తేదీ వరకూ ఉంది. నకిరేకల్ గ్రామపంచాయతీ పాలకవర్గం గడువు ఈ నెల 15న పూర్తి కాగా పురపాలక సంఘంగా మారింది. కొత్తూరు కొత్త పురపాలక సంఘంగా ఏర్పాటైంది. వీటన్నిటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం యోచిస్తోంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసి, మార్చి లోపు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది తీసుకువచ్చిన కొత్త పురపాలక చట్టం వలన వార్డుల/డివిజన్ల సంఖ్య పెరిగింది. గత పురపాలక ఎన్నికల్లో ఈ విభజనపైనే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పాటు హైకోర్టులోనూ కేసులు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో విభజన విషయంలో చట్టపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. జనవరి 15 ఓటర్ల జాబితానే ప్రాతిపదిక కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీఐ) జనవరి 15వ తేదీ ప్రచురించే ఓటర్ల తుదిజాబితానే పురపాలక ఎన్నికలకు ప్రాతిపదిక అవుతుంది. జనవరి 15లోపు వార్డుల పునర్విభజన పూర్తయితే ఆ మేరకు ఓటర్ల జాబితాలను ఖరారు చేస్తారు. తాజా ఎన్నికలకు సంబంధించి మేయర్, ఛైర్‌పర్సన్ల రిజర్వేషన్లు ఈ ఏడాది జనవరిలో జరిగిన పుర ఎన్నికల నేపథ్యంలో ఖరారు చేశారు. వరంగల్ మేయర్ పదవి బీసీకి, ఖమ్మం మేయర్ పదవి జనరల్ మహిళకు, సిద్దిపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ జనరల్ మహిళకు, అచ్చంపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ జనరల్‌కు రిజర్వు అయ్యింది.