
కరోనా వైరస్ విస్తరణ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. కొవిడ్ టెస్ట్ వెంటనే చేయించుకుంటే ఖచ్చితమైన ఫలితం రాదంటున్నారు అమెరికాకు చెందిన యూనివర్సిటీ సైంటిస్టులు.
కరోనా వైరస్ సోకిన మొదటి రోజుల్లోనే పరీక్షలు నిర్వహిస్తే వారికి వ్యాధి సోకనట్లు తప్పుడు ఫలితాలు రావచ్చని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనం స్పష్టం చేసింది. లక్షణాలు కనిపించాక మూడు రోజులకు పరీక్షలు చేయడం మేలని అధ్యయనం సూచించింది. జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన అధ్యయనంలో 1,330 మంది రోగుల నమూనాలను విశ్లేషించారు. ఆసుపత్రిలో చేరిన రోగులతోపాటు ఇతర అనుమానితులను కూడా పరీక్షించినట్లు లారెన్ కౌసిర్కా అనే శాస్త్రవేత్త తెలిపారు. ఆర్‌టీ–పీసీఆర్ టెస్ట్ ఫలితాలు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించిన సమయంలో నమూనాలు సేకరించామని.. వాటి ఆధారంగా తమ పరీక్షల ఫలితం నెగటివ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఆర్‌టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహించేటప్పుడు ముక్కు, గొంతుల్లోని ద్రవాల నమూనాలు సేకరించడంతోపాటు లక్షణాలు ఎప్పుడు మొదలయ్యాయి అన్నదీ నమోదు చేస్తారని లారెన్ స్పష్టం చేశారు. ఈ సమాచారం ద్వారా తాము వైరస్ సోకిన తరువాత నాలుగు రోజులకు పరీక్షలు చేస్తే 67 శాతం నెగటివ్ ఫలితాలు రావచ్చునని అంచనా వేసినట్లు వివరించారు. కరోనా లక్షణాలు ఉన్న వారందరికీ వైరస్ ఉన్నట్లుగానే భావించి చికిత్స అందించాలని ఆయన సూచించారు. ఈ విషయాన్ని రోగులకు స్పష్టంగా వివరించాలని తెలిపారు.
కోవిడ్‌కు అడ్డుకట్ట వేసేందుకు రూపొందించిన వ్యాక్సిన్‌ను జూలైలో భారీగా ప్రయోగాత్మకంగా పరిశీలించి చూడనున్నట్లు అమెరికా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, మోడెర్నా ప్రకటించాయి. జూలైలో 30 వేల మంది వలంటీర్లపై ఈ టీకాను ప్రయోగించి చూస్తామని, ఇందుకు అవసరమైన డోసులను ఇప్పటికే సిద్ధం చేశామన్నారు. పెద్దవాళ్లలో ఎలా పనిచేస్తుందో చూడటమే కీలకమైన ఈ ప్రయోగ ఉద్దేశమని.. మార్చిలో ఇప్పటికే 45 మంది వలంటీర్లపై ప్రయోగించిన ఫలితాలు అందాల్సివుందని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది.