హైదరాబాద్‌లో భారీ వర్షాల వల్ల దెబ్బతిని శిథిలావస్థకు చేరుకున్న భవనాల కూల్చివేతకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. గత ఐదు రోజుల్లో శిథిలావస్థకు చేరిన 49 భవనాల కూల్చివేసినట్టు జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ టీవీ9కు చెప్పారు. ఎక్కడైనా నగరంలో శిథిల భవనాలు ఉంటే వెంటనే నివాసులు ఖాళీ చేయాలని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఒక వేళ కూల్చివేతతో నిరాశ్రయులై.. ప్రత్యామ్నాయ వసతి లేనివారికి కమ్యునిటీహాల్స్‌లో తాత్కాలిక వసతి కల్పిస్తామని లోకేష్ కుమార్ చెప్పారు. ఇప్పటికే మాన్సూన్ సీజన్‌లో శిథిలావస్థకు చేరిన భవనాలు, ఇతర నిర్మాణాలకు నోటీసులు జారీచేసినట్లు తెలిపారు. టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు అన్ని సర్కిళ్లలో సర్వే జరిపి భవనాల పటిష్టతపై ఇంజనీరింగ్ విభాగం ద్వారా తనిఖీలు చేయించినట్లు తెలిపారు. నగరంలో మొత్తం 531 భవనాలు శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. వాటిలో 176 భవనాలను కూల్చివేసినట్లు వివరించారు. అలాగే 109 భవనాలను మరమ్మతులు చేయించడం జరిగినట్లు తెలిపారు.