Donald Trump Impeachment: అమెరికాలో ఏ అధ్యక్షుడు ఎదుర్కొనంత విమర్శలు డోనాల్డ్ ట్రంప్ ఎదుర్కొన్నారు. అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుంచి తన వివాదస్పద నిర్ణయాలతో అపకీర్తి మూటగట్టుకున్న ట్రంప్ మరికొన్ని రోజుల్లో అధికారానికి దూరం కానున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా ఓటమిని అంగీకరించనంటూ ట్రంప్ చేసిన రచ్చ అంతా ఇంతకాదు. ఈ నేపథ్యంలో అమెరికాలో జరిగిన అల్లర్లతో అందరూ ట్రంప్‌ను విమర్శించారు.
ఇదిలా ఉంటే తాజాగా ట్రంప్‌నకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలంటూ ప్రవేశపెట్టిన నూతన అభిశంసన తీర్మానానికి.. ఆ దేశ ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారు జామున 3 గంటలకు ఓటింగ్ ముగిసింది. మెజార్టీ సభ్యులు అభిశంసనకు మద్ధతు పలికారు. ఇక ఈ నిర్ణయాన్ని త్వరలోనే సెనేట్‌కు పంపనున్నారు. అమెరికా చరిత్రలో రెండో సారి అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచారు. ఈ లెక్కన చూస్తుంటే పదవి కాలం కంటే మందే ట్రంప్ గద్దె దిగనున్నాడన్న వార్తలకు బలం చేకూరుతోంది.