కరోనా టీకా కోసం భారత్ వైపే ప్రపంచ దేశాల చూపు, ఇండియాలోని ఔషధ తయారీ సంస్థలకు వివిధ దేశాల నుంచి భారీగా ఆర్డర్లు

ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ తయారీ దేశంగా పేరున్న భారత్ కు కరోనా వ్యాక్సిన్ తయారీతో ఆపేరు మరో పదింతలైంది. గతంలోనూ ప్రపంచ..

  • Venkata Narayana
  • Publish Date - 2:11 pm, Wed, 13 January 21
South Africa To Store COVID-19 Vaccines At Secret Place For Fear Of Theft

ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ తయారీ దేశంగా పేరున్న భారత్ కు కరోనా వ్యాక్సిన్ తయారీతో ఆపేరు మరో పదింతలైంది. గతంలోనూ ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల వారికి వివిధ రకాల మందులు సరఫరా చేసిన భారత్, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ విషయంలోనూ అదే దూకుడు ప్రదర్శిస్తోంది. కొవిడ్ మహమ్మారిని తుదముట్టించేందుకు ప్రపంచంలోనే అధికంగా కరోనా వ్యాక్సిన్లను తయారు చేసే దేశంగా ఇండియా నిలువబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా టీకా డిమాండ్ లో అత్యధికంగా 60 శాతం అవసరాలను భారత్ తీర్చబోతోంది.

నెలకు 7 కోట్ల టీకాలను తయారు చేస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా(ఎస్‌ఐఐ) ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా, మరో కరోనా టీకా తయారీ సంస్థ భారత్‌ బయోటెక్‌ ఏడాదికి 20 కోట్ల డోసుల టీకాలు తయారు చేస్తామని తెలిపింది. ఇక, మధ్య, అల్పాదాయ దేశాలకు 100 కోట్ల వ్యాక్సిన్లు సరఫరా చేస్తామని సీరం ఇనిస్టిట్యూట్‌ తెలుపగా, 3 కోట్ల డోసుల కోసం సీరం ఇనిస్టిట్యూట్‌తో బంగ్లాదేశ్‌ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఇక, సౌదీ అరేబియా, మయన్మార్, మొరాకో, నేపాల్ తదితర దేశాలతో సీరం ఇన్‌స్టిట్యూట్ తోపాటు, భారత్ బయోటెక్ కూడా పలు ఒప్పందాలు చేసుకున్నాయి.