ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వాచాలత్వం పెరుగుతోంది.. తనేం మాట్లాడుతున్నారో తనకే తెలియడం లేదు.. ఇప్పుడు భారత్‌పై నోరు పారేసుకున్నారు.. చైనా, రష్యాలతో కలిసి భారత్ ప్రపంచ పర్యావరణానికి విఘాతం కలిగిస్తున్నదట! నార్త్ కరోలినాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ ఈ మాటన్నారు. అధ్యక్షుడిగా తను ఎంతో చేశానని గొప్పలు చెప్పుకున్నారు.. అమెరికా ఇంధన స్వయం సమృద్ధిని సాధించిందంటే అది తన ఘనతేనని ఆత్మస్తుతి చేసుకున్నారు. అమెరికా పర్యావరణం, ఓజోన్ చక్కగా ఉన్నాయని, ఇండియా, చైనా, రష్యా వంటి దేశాలే వాయు కాలుష్యాన్ని పెంచుతున్నాయని ఆరోపించారు అగ్రదేశపు అధ్యక్షుడు. అసలు పర్యావరణంపై ట్రంప్‌కు ఎంత శ్రద్ధ ఉందో అందరికీ తెలిసిన విషయమే! పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటైన పారిస్ డీల్ నుంచి వైదొలిగినది ఈయనే కదా! ఈ డీల్‌తో తమకు కోట్లాది డాలర్ల ఖర్చు అవుతుందని, ఎన్నో ఉద్యోగాలు పోతాయని ఓ కారణం చెప్పుకొచ్చారు.. ఇక అప్పట్నుంచి పర్యావరణం టాపిక్ వచ్చినప్పుడల్లా చైనాను, భారత్‌ను తిట్టిపోస్తూనే ఉన్నారు. పారిస్ డీల్‌తో లాభపడేది చైనా, భారత్‌లేనని, అమెరికా బాగుకునేది ఏమీ లేదని అంటూ వచ్చారు.