తెలంగాణ ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్లను సాధించుకోవడానికి చేపట్టిన సమ్మె ఉద్రిక్తంగా మారుతోంది. ఇవాళ్టితో 37వ రోజుకు చేరుకున్న ఈ సమ్మెకు విపక్షాల నుంచి భారీ మద్దుతు లభించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు డెడ్‌లైన్ విధించినా.. కార్మికులు వాటిని భేఖాతరు చేశారు. ఒకపక్క ఆర్టీసీ జేఏసీ.. మరో పక్క తెలంగాణ ప్రభుత్వం మెట్టు కూడా దిగకుండా మొండివైఖరితో కొనసాగుతుండటంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణ ఉద్యమం తర్వాత అంతటి తారాస్థాయికి ఆర్టీసీ సమ్మె తీవ్ర రూపం దాల్చడంతో రాజకీయ వర్గాలను కలవరపెడుతోంది. తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం సానుకూలంగా లేదని.. న్యాయస్థానం మాత్రమే న్యాయం చేయగలదని ఆర్టీసీ కార్మికులు గట్టి నమ్మకంతో ఉండటమే కాకుండా.. ప్రభుత్వం చర్చలకు తమను ఆహ్వానిస్తే తప్పకుండా వస్తామని వారు చాలాసార్లు సుముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
అయితే సీఎం కేసీఆర్ మాత్రం కార్మికులతో చర్చలు ముగిసిన అధ్యాయమని మొదటి నుంచి చెబుతూనే వస్తున్నారు. అంతేకాకుండా ఒక్క మెట్టు తాను దిగేది లేదని.. కార్మికులే దిగిరావాలని పట్టుదలగా వ్యవహరిస్తుండటంతో సమస్య మరింత జటిలంగా మారుతోంది. మరోవైపు డెడ్‌లైన్ల లోపు కార్మికులు ఉద్యోగాల్లో చేరకపోతే మిగిలిన 5100 రూట్లను సైతం ప్రైవేటీకరణ చేస్తామని కేసీఆర్ స్పష్టం చేయడమే కాకుండా.. అందుకోసం కార్యాచరణను కూడా సిద్ధం చేస్తున్నారు.
ఇక సోమవారం ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో ఇరు వర్గాలు తమ వాదనలు వినిపించనుండగా.. జేఏసీ ఇప్పటికే భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించి నవంబర్ 12 నుంచి ఆమరణ దీక్షలకు దిగనున్నట్లు ప్రకటించింది. అటు సీఎం కేసీఆర్ కూడా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడంలో వచ్చే న్యాయపరమైన చిక్కులు గురించి విశ్లేషించినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ చేసే కన్నా లీజు పద్దతిలో బస్సులను తిప్పితే ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెప్పినట్లు సమాచారం.
అంతేకాకుండా రేపు కోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు బలంగా వినిపించాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఆర్టీసీ కార్మికులకు అన్నీ చేసినా.. చర్చలు జరిపినా కూడా సమ్మెకు వెళ్లారని ఆయన అన్నారు. ఒకవేళ కోర్టులో తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే మాత్రం సుప్రీమ్ కోర్టుకు వెళ్లాలని కేసీఆర్ సూచించారట. అయితే కొంతమంది నెటిజన్లలో మాత్రం ట్రబుల్ షూటర్ హరీష్ రావును సంథికి పంపిస్తే.. సమస్య ఇంతవరకు వచ్చేది కాదని.. ఇప్పటికైనా కేసీఆర్ ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని అభిప్రాయపడుతున్నారు.