బల్ధియా పీఠంపై కన్నేసిన వారసులు.. మేయర్ రేసులో మహిళామణులు..

|

Dec 01, 2020 | 7:19 AM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా సాగుతున్నాయి. బల్ధియా పీఠంపై కన్నేసిన అన్ని పార్టీలు పోటా పోటీ ప్రచారంతో హోరెత్తించారు. అత్యధిక కార్పొరేటర్ స్థానాలు గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి.

బల్ధియా పీఠంపై కన్నేసిన వారసులు.. మేయర్ రేసులో మహిళామణులు..
Follow us on

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా సాగుతున్నాయి. బల్ధియా పీఠంపై కన్నేసిన అన్ని పార్టీలు పోటా పోటీ ప్రచారంతో హోరెత్తించారు. అత్యధిక కార్పొరేటర్ స్థానాలు గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ పోటీలో ముందంజలో టీఆర్ఎస్ ఉన్నప్పటికీ, దుబ్బాక విజయంతో బీజేపీ కూడా మేయర్ సీటుపై కన్నేసింది. ఇక గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో దిగాలుపడ్డ కాంగ్రెస్ పార్టీ.. ఎలాగైనా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గౌరవప్రదమైన సంఖ్యను దక్కించుకోవాలని కసరత్తు చేస్తోంది.

ఈసారి హైదరాబాద్ మేయర్ పదవిని జనరల్ కేటగిరీలో మహిళకు కేటాయించారు. టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పొత్తుతో మెజారిటీ స్థానాలు గెల్చుకొని మేయర్ సీటు దక్కించుకొనే అవకాశాలే అత్యధికంగా ఉండడంతో ఇక అధికార పార్టీ నేతల్లో ఆశలు మొదలయ్యాయి. ముఖ్యంగా టీఆర్ఎస్‌లో హైదరాబాద్‌కు చెందిన సీనియర్ నేతలు.. మేయర్ పదవి తమ వారసులకే రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నగరానికి చెందిన ముఖ్య నేతలంతా తమ భార్య, కూతురు లేదా కోడళ్లకు మేయర్ స్థానం దక్కేలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

గ్రేటర్‌లో ఓ పక్క పోలింగ్ కొనసాగుండగానే, ఈసారి బల్దియాలో బస్తీమే సవాల్ అంటున్నాయి పార్టీలు. ముఖ్యంగా పలు సర్వేలు కూడా గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందని చెబుతున్నాయి. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీలో మేయర్ రేసులో ఉన్నవారి సంఖ్య పెరిగింది. టీఆర్ఎస్‌లో మేయర్ స్థానంపై కన్నేసిన ఆశావహుల సంఖ్య భారీగా ఉంది. తదుపరి మేయర్‌గా ఎవరు ఉండబోతున్నారనే దానిపై అందరి ఆసక్తి నెలకొంది. మేయర్ పదవిని దక్కించుకోవటానికి బిజెపి- కాంగ్రెస్ పార్టీలు దృష్టి సారించినప్పటికీ టీఆర్ఎస్ ముందు వారి కలలు నెరవేరే సూచనలు కనిపించడం లేదు.. ఎక్స్-అఫిషియో సభ్యులు కీలక నిర్ణయాత్మకంగా జీహెచ్ఎంసీలో ఉన్నారు. అధికార టిఆర్ఎస్ అత్యధిక సంఖ్యలో ఎక్స్-అఫిషియోలను కలిగి ఉంది. ఇది కూడా ఓ కీలక పాయింట్.. దీంతో టిఆర్ఎస్ పార్టీ మేయర్ పదవిని గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

బల్దియా పీఠంపై కన్నేసిన రాజకీయ వారసుల హడావుడి ఒక్కసారిగా ఊపందుకుంది. జీహేచ్‌ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి ముందే ఆయా పార్టీల ముఖ్యనేతల వారసులు పావులు కదుపుతున్నారట. ఒకప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండి ఇప్పుడు టీఆర్‌ఎస్‌లో అప్రకటిత రెండోస్థానంలో కొనసాగుతున్న ముఖ్యనేత పీ.జనార్థన్‌రెడ్డి కుమార్తె విజయలక్ష్మీ ఇప్పుడు ఈ విషయంలో రేసులో ముందున్నదనే ప్రచారం ఊపందుకుంది. తెలంగాణ ఏర్పడ్డాక తొలి హైదరాబాద్ మేయర్ పదవికి తన పేరునే ప్రకటించాలని సదరు నేత కుమార్తె పట్టుబడుతోందట. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా ఎదిగిన నేత పీజేఆర్ కూతురు విజయారెడ్డి కూడా ఆ పార్టీ తరఫున మేయర్ రేసులో ముందుకు తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దివంగత నేత మాజీ మంత్రి నాయిని నరసింహారెడ్డి కుమార్తె మీనం కవితారెడ్డి ఈ రేసులో ఉన్నారు. దీంతో ప్రముఖ రాజకీయ కుటుంబాల్లోని మహిళలు కీలక పదవి కోసం అప్పుడే లాబీంగ్ మొదలైంది.

మొత్తానికి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మహిళా మేయర్ అభ్యర్థి విషయంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మేయర్ అశావాహుల సంఖ్య ఎక్కువగా ఉండటంపై సీఎం కెసిఆర్, మంత్రి కేటీఆర్ తుది ఎంపికపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.