కేరళ వైపుగా బురేవి తుపాను దూసుకొస్తున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళలోని ఏడు జిల్లాలతో పాటు దక్షిణ తమిళనాడులోనూ ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. మరికొన్ని గంటల్లో కేరళలో తిరువనంతపురం దగ్గర తీరందాటే అవకాశముందని వెల్లడించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అధికారులు. బలమైన గాలులు, భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మత్స్యకారులు ఎవరూ వేటకు వెల్లొద్దని హెచ్చరిస్తున్నారు. కేరళలోని తిరువనంతపురం, కొల్లం, పతనమిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి, ఎర్నాకుళం ఈ ఏడు జిల్లాలపై బురేవి తీవ్ర ప్రభావం చూపనుంది. బురేవి తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తమైన కేరళ సర్కార్… ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది.అత్యవసరంగా ఇవాళ ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది కేరళ ప్రభుత్వం. కొన్ని ఎయిర్‌పోర్ట్స్‌లో విమాన సేవలను నిలిపివేసింది. తుఫాను నేపథ్యంలో సాయుధ దళాల ప్రతినిధులు, కోస్ట్ గార్డ్, ఎన్డీఆర్ఎఫ్, వివిధ విభాగాధిపతులు, డీజీపీ, ప్రధాన కార్యదర్శిలతో ఉన్నత స్థాయి సమావేశం జరిపింది. తుఫాన్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేసింది ప్రభుత్వం. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ను భారీగా మోహరించింది. ప్రజలను సురక్షితమైన ప్రదేశానికి తరలించే ప్రక్రియ జరుగుతోంది. ఇప్పటికే 2 వేల 49 సహాయక శిబిరాలు ఏర్పాటు చేసింది. త్రివేండ్రం జిల్లాలోని పొన్ముడి హిల్ స్టేషన్ నుండి అనప్పారాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సహాయ శిబిరానికి ప్రజలను తరలిస్తున్నారు.