CP Sajjanar About Fraud Calls: ఏ చిన్న అవకాశం దొరికినా సైబర్ నేరగాళ్లు వదిలి పెట్టడం లేదు. జనాలను ఎలా మోసం చేద్దామా అన్న ఆలోచనతో ఉన్న నేరస్థులు చివరికి కరోనా వ్యాక్సిన్‌ను కూడా తమ నేరానికి అనువుగా మార్చుకుంటున్నారు. ఇటీవల వెలుగు చూసిన కొన్ని ఉదాంతాలే దానికి కారణం.
వివరాల్లోకి వెళితే.. కొవిడ్-19 వ్యాక్సిన్ ఇప్పిస్తామంటూ కొన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇందుకోసం మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోండని అడుగుతూ ఆధార్ వివరాలతో పాటు మొబైల్ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ చెప్పండంటూ కాల్స్ చేస్తున్నారు. అయితే ఇలా చేసిన వెంటనే బ్యాంకు ఖాతా ఖాళీ అయిపోతుంది. ఇలాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరిస్తున్నారు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్. ఇటీవల ఈ తరహా ఫిర్యాదులు రావడంతో సీపీ ఈ మేరకు ప్రకటన చేశారు. కొవిడ్ -19 వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ అని ఫోన్ వస్తే అది ఫేక్ కాల్‌గా గుర్తించి వెంటనే కట్ చేయాలని తెలిపారు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు సైబరాబాద్ వాట్సాప్ -9490617444 లేదా డయల్ 100 లేదా సైబరాబాద్ సైబర్ కంట్రోల్ 9490617310కు సమాచారం అందిచాలని సజ్జనార్ కోరారు.