కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సిన్ తయారీ ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నదని ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ సంస్థ అయిన సీర్‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది. వచ్చే మూడు నెలల్లో కొన్ని లక్షల డోసుల వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయాలని తాము లక్ష్యంగా నిర్ణయించుకున్నామని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ సీఈవో పూనావాలా చెప్పారు.
కొవిడ్-19 వ్యాక్సిన్ పురోగతిపై వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అడార్ పూనావాలాతో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది. టీకా అభివృద్ధికి పూనవాలా చేస్తున్న కృషీని సిఎం ప్రశంసించారు. వ్యాక్సిన్ వచ్చిన వెంటనే ఒడిశాకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. 1 వ దశ ట్రయల్‌లో టీకా మంచి ఫలితాలను చూపించిందని, భారతదేశంలో ఆగస్టు మధ్యలో రెండో దశ ట్రయల్స్ ప్రారంభిస్తామని పూనావాలా వివరించారు. అక్టోబర్-నవంబర్ నాటి కల్లా వ్యాక్సిన్ నూ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. అన్ని ట్రయల్స్ పూర్తిచేసుకుని లైసెన్స్ పొందిన తర్వాత ఆ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి ప్రారంభమవుతుందని వివరించారు. అయితే, అవసరమైన అనుమతులు పొందిన తర్వాత కొవిడ్-19 టీకాలకు ఒడిశా రాష్ట్రానికి మొదటి ప్రాధాన్యతగా చూడాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవోను కోరారు.
కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ పరిశోధనా సంస్థలతో పూనవాలా జతకట్టడంపై నవీన్ పట్నాయక్ ప్రశంసించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఐఐతో సంప్రదింపులు జరుపుతుందని చెప్పారు. కరోనా పరీక్ష ఫలితాలను ట్రాక్ చేయడానికి ఇన్స్టిట్యూట్ను సంప్రదించినందుకు పూనవల్లా ముఖ్యమంత్రిని ప్రశంసించారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు రెండు రోజుల కిందట ప్రకటించారు. ఇక, వ్యాక్సిన్ తయారీలో భారత్‌లోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి పనిచేస్తోంది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనికాతో కలిసి కరోనా వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు పూనావాలా తెలిపారు. అందుకు సంబంధించి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఇప్పటికే డీసీజీఐ అనుమతి కూడా పొందిందని చెప్పారు. అక్టోబర్ నాటికల్లా నెలకు ఏడు కోట్ల మోతాదుల వ్యాక్సిన్‌ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది డిసెంబర్ నాటికి నెలకు 10 కోట్ల మోతాదు వరకు తీసుకోవాలని యోచిస్తోంది.