Covid-19: గాంధీ ఆసుపత్రికి కరోనా ఎఫెక్ట్… అసలేం జరుగుతుందంటే?

కరోనా వైరస్ ప్రభావం ఏంటో గాని తెలంగాణలోని ప్రతిష్టాత్మక ఆసుపత్రి గాంధీ హాస్పిటల్‌పై యావత్ తెలుగు ప్రజల ఫోకస్ పడింది. రెండు దశాబ్దాల క్రితం సకల సౌకర్యాలతో ముషీరాబాద్ జైలును కూల్చి మరీ నిర్మించిన గాంధీ ఆసుపత్రికిపు కరోనా కళంకం తెస్తోంది.

Covid-19: గాంధీ ఆసుపత్రికి కరోనా ఎఫెక్ట్... అసలేం జరుగుతుందంటే?

Updated on: Mar 05, 2020 | 3:24 PM

Coronavirus effect on Gandhi hospital: కరోనా వైరస్ ప్రభావం ఏంటో గాని తెలంగాణలోని ప్రతిష్టాత్మక ఆసుపత్రి గాంధీ హాస్పిటల్‌పై యావత్ తెలుగు ప్రజల ఫోకస్ పడింది. రెండు దశాబ్దాల క్రితం సకల సౌకర్యాలతో ముషీరాబాద్ జైలును కూల్చి మరీ నిర్మించిన గాంధీ ఆసుపత్రికిపు కరోనా కళంకం తెస్తోంది. ఒకవైపు కరోనా వైరస్ అనుమానితుల తాకిడి.. మరోవైపు ప్రభుత్వ పెద్దల హూంకరింపులు.. ఇంకోవైపు మీడియా హడావిడి.. వెరసి గాంధీ ఆసుపత్రిలో వైద్య సౌకర్యాలతోపాటు లోటుపాట్లు ఒక్కటొక్కటే వెలుగులోకి వస్తున్నాయి.

కరోనా కేసుల కోసం ప్రత్యేకంగా వార్డును ఏర్పాటు చేస్తే.. అందులో సౌకర్యాలు సరికదా.. కనీసం సరిపడా బాత్‌రూములు లేవని రెండు రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. దాన్ని సరిదిద్దేలోపే.. ఇబ్బడిముబ్బడిగా తరలివస్తున్న కరోనా అనుమానిత కేసులను తట్టుకోలేమంటూ గాంధీఆసుపత్రి వైద్యులు చేతులెత్తేశారు. వారిని ఒప్పించి.. ప్రత్యేక వార్డును కొనసాగించేలా చూస్తున్న సర్కార్ ముందు జూనియర్ డాక్టర్లు మరో డిమాండ్ పెట్టారు.

గాంధీ ఆసుపత్రి రెఫరల్ ఆసుపత్రి కావడంతో జనరల్ పేషెంట్లు వేలాది సంఖ్యలో ప్రతీ రోజు వస్తుంటారని.. అతి భయంకరమైన కరోనా వైరస్ గుర్తింపునకు ప్రత్యేక వార్డును గాంధీ ఆసుపత్రిలో కొనసాగించడం కరెక్టు కాదని జూనియర్ డాక్టర్లు వాదిస్తున్నారు. వందల సంఖ్యలో వస్తున్న కరోనా అనుమానితులతో రెగ్యులర్ రోగులు తారసపడితే వారికి కరొనా సోకే ప్రమాదం వుందని వారు అంటున్నారు.

మరోవైపు తొలి కరోనా పాజిటివ్ కేసును గుర్తించడంలోను, ప్రకటించడంలోను విపరీత జాప్యం చేశారంటూ ఓ వైద్యురాలిని సస్పెండ్ చేసింది ప్రభుత్వం. దీనిపై కూడా గాంధీ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త వైరస్ దానికి తోడు విపరీతమైన పని ఒత్తిడి ఈ క్రమంలో కాస్త జాప్యం జరిగినంత మాత్రాన చేసిన కృషిని పక్కన పెట్టి సస్పెండ్ చేయడమేంటని వైద్యవర్గాలు ప్రశ్నిస్తున్నాయి.

గాంధీ ఆసుపత్రి వ్యవహారాలపై హైకోర్టు కూడా దృష్టి సారించడం మరో విశేషం. మాస్కులు, మందులు ఫ్రీగా ఇవ్వాలని, గాంధీలో ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటి వరకు గాంధీలో 39 మంది అనుమానితులు ఐసోలేషన్ వార్డుల్లో వున్నారు. తాజాగా ప్రభుత్వం గాంధీ ఆసుపత్రితోపాటు ఉస్మానియా, ఫీవర్ ఆసుపత్రుల్లోను ఐసోలేషన్ వార్డుల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో పాటు 12 ప్రైవేటు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లోను ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేస్తున్నారు.

మరోవైపు గాంధీ ఆసుపత్రితోపాటు తెలంగాణాలో కరోనా పరిస్థితిపై రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ కోఠీలోని వైద్య శాఖ కమిషనర్ కార్యాలయంలో సమీక్ష జరిపారు. కరోనాకు సంబంధించిన వదంతులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలెవరికీ కరోనా సోకలేదని, కేవలం విదేశీలకు వెళ్ళి వచ్చిన వారికే సోకిందని ఆయన క్లారిటీ ఇచ్చారు. కరోనాను నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం తక్షణం వంద కోట్ల రూపాయలను విడుదల చేసిందని మంత్రి వెల్లడించారు.

ఇదీ చదవండి: కరోనాపై తెలంగాణ సమరం.. మంత్రి ఇంఛార్జ్‌గా కమాండ్ కంట్రోల్