Corona Impact On Brain: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలా కుతలం చేసింది. ఆరోగ్యం నుంచి ఆర్థిక వ్యవస్థల వరకు అన్ని రంగాలను కుదేలు చేసిందీ మహమ్మారి. కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తే శ్వాస వ్యవస్థపై, ఊపిరితిత్తులతపై ప్రభావం చూపుతుంది… ఇప్పటి వరకు మనకు తెలిసింది ఇదే. అయితే ఈ వైరస్ వల్ల శరీరంలోని మరో అవయవంపై కూడా ప్రభావం పడుతుందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.
కరోనాతో చనిపోయిన వారిపై అమెరికా శాస్ర్తవేత్తలు జరిపిన పరిశోధనల్లో కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. కరోనా వైరస్ శ్వాస వ్వవస్థతో పాటు మెదడుపై కూడా ప్రభావం చూపినట్లు పరిశోధనల్లో వెల్లడైంది. అమెరికాకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ అండ్ స్ట్రోక్ శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిస్‌లో ప్రచురించారు. కరోనాతో చనిపోయిన వారి మెదడులో మైక్రోవాస్కుల్ అనే రక్త నాళాలు దెబ్బతిన్నట్లు వైద్య నిపుణులు గుర్తించారు. అయితే మెదడు కణజాలాల్లో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించకపోయినప్పటికీ.. మెదడుపై స్పష్టమైన ప్రభావం కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు. చూడాలి మరి కరోనాపై పూర్తి పరిశోధనలు జరిగిన తర్వాత మరెన్ని ఆసక్తికర విషయాలు బయటపడతాయో.