ఢిల్లీలో శనివారం జరిగిన ‘ భారత్ బచావో ‘ ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు గ్రాడ్యుయేట్లలా డ్రెస్సులు ధరించారు, ర్యాలీ జరిగే స్థలం వద్ద పకోడాలు, టీ అమ్ముతూ వింత నిరసన తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. ‘ మోదీ హైతో మండీ హై ‘అనే స్లోగన్ రాసి ఉన్న విండ్ ఛీటర్స్ ధరించిన వీరు.. తమ మెడల్లో ఉల్లి దండలు కూడా వేసుకుని మండుతున్న కూరగాయల ధరలకు నిరసన తెలిపారు. (గ్రాడ్యుయేట్లు స్నాతకోత్సవ సమయంలో ఇలాంటి డ్రెస్సులే ధరించడం సహజం). మాకు ఉద్యోగాలు కల్పించండి.. ధరల పెరుగుదలను అరికట్టండి అంటూ వీళ్లంతా ముక్త కంఠంతో నినదించారు. శనివారం రామ్ లీలా మైదానం లో జరిగిన ర్యాలీకి భారీ సంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరైన సంగతి తెలిసిందే. ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. పౌరసత్వ బిల్లు, ఎన్నార్సీ వంటి వాటిపై మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను దుయ్యబట్టారు.