AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Free Bus: మహిళలకు గుడ్‌న్యూస్.. ఇకపై డీలక్స్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం! ఎప్పటినుంచంటే?

ప్రస్తుతం కేరళ మినహా దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవలే కొత్తగా ఈ పథకాన్ని ప్రారంభించిన తమిళనాడు ప్రభుత్వం.. దాన్ని మరింత విస్తరిస్తూ మహిళలకు ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 2 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది.

Free Bus: మహిళలకు గుడ్‌న్యూస్.. ఇకపై డీలక్స్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం! ఎప్పటినుంచంటే?
Fare Free Bus Travel Scheme
Anand T
|

Updated on: Aug 24, 2026 | 7:02 PM

Share

ప్రస్తుతం కేరళ మినహా దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాల్లోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆయా ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. మొదట ఈ పథకానికి తెలంగాణలో శ్రీకారం చుట్టగా, ఆ తర్వాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ అమలులోకి తెచ్చారు. అలాగే ఇటీవలే ఎన్నికల్లో విజయం సాధించి బాధ్యతలు చేపట్టిన తమిళనాడు సీఎం విజయ్ సైతం ప్రభుత్వం ఏర్పడగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ పథకానికి సంబంధించి తాజాగా రాష్ట్రంలోని మహిళలకు సీఎం విజయ్ మరో శుభవార్త చెప్పారు. అక్టోబర్ నుంచి మహిళలకు ఆర్డినరీ బస్సుల్లో మాత్రమే కాకుండా ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించబోతున్నట్లు వెల్లడించారు.

సోమవారం అసెంబ్లీ వేదికగా ఆయన ఈ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణాన్ని “వెట్రి పయనం” పేరుతో విస్తరించబోతున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని మహిళలంతా మెట్రోపాలిటన్, పట్టణ ప్రాంతాలలో నడిచే ఎక్స్‌ప్రెస్, ఎల్‌ఎస్‌ఎస్, డీలక్స్ ప్రభుత్వ బస్సులలో ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. అలాగే జిల్లాల మధ్య ప్రయాణాల కోసం గ్రామీణ, కొండ ప్రాంతాల్లో నడిచే ప్రభుత్వ బస్సులకు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు.

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2 నుండి ఈ పథకాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా ఈ పథకానికి ఎటువంటి ఆదాయ పరిమితి గానీ, ప్రయాణాల సంఖ్యపై పరిమితి గానీ ఉండవని.. ట్రాన్స్‌జెండర్లకు కూడా ఈ పథకం కింద ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన లబ్ధిదారులకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల మొత్తాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us