CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. సర్కార్ అలర్ట్.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు!
Telangana: కొవిడ్ తరహాలో ఎల్‌నినోపై యాక్షన్ ప్లాన్ చేపట్టాలని, ఎల్‌నినోతో తీవ్ర సంక్షభం వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. వచ్చే జూన్ వరకు యాక్షన్ ప్లాన్ రూపొదించాలన్నారు. తాగు, సాగునీటి సమస్యలపై..

హైదరాబాద్: ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో తీవ్ర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ సంక్షోభాన్ని ముందుగానే గుర్తించి, ఎదుర్కొనేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్తులో పరిస్థితులు చేయిదాటకుండా పకడ్బందీ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. శనివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఎల్‌నినో ప్రభావం, రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై చర్చించారు.
రాబోయే 8 నెలలు అత్యంత కీలకం
ఎల్‌నినో సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రాబోయే ఎనిమిది నెలలు కీలకమని సీఎం పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ప్రజలను అప్రమత్తం చేసి, నీటి వినియోగం, విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. సినిమా, మీడియా, కళాజాతలు, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా ఎల్‌నినో ప్రభావంపై విస్తృతంగా అవగాహన కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
విద్యుత్ కొరత రాకుండా ముందస్తు చర్యలు
రాబోయే రోజుల్లో విద్యుత్ సమస్య తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉందని, అయితే మార్కెట్‌లో విద్యుత్ అందుబాటులో ఉండటం సవాలుగా మారుతోందని తెలిపారు. అందుబాటులో ఉన్న విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్‌పై ఆధారపడే పనులను సాధ్యమైనంత వరకు తాత్కాలికంగా వాయిదా వేసుకునే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. విద్యుత్ సరఫరాను సీఎం కార్యాలయ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
చేతికొచ్చే పంటలను కాపాడాలి
రైతులు ఇప్పటికే సాగు చేసిన పంటలను కాపాడటంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. పంటల ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసి, పంట చేతికొచ్చే వరకు నీటి కొరత రాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. భవిష్యత్తులో తాగునీరు, సాగునీటి సమస్యలు తీవ్రం కాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని, చుక్క నీరు కూడా వృథా కాకుండా చూడాలని స్పష్టం చేశారు.
త్వరలో మంత్రులతో ప్రత్యేక సమావేశం
రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంపై త్వరలో మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు. దాదాపు 215 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కరువు మండలాల ప్రకటన, ఆర్థిక సాయం తదితర అంశాలపై చర్చించనున్నారు. రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని కేంద్రాన్ని కోరిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. అలాగే VB-G RAM G పథకం కింద 125 రోజుల ఉపాధికి అదనంగా మరో 50 రోజుల పని కల్పించాలని కేంద్రాన్ని కోరే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అదనపు పని దినాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
దసరా తర్వాత గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు వార్‌రూమ్, ప్రజల సమస్యల పరిష్కారానికి టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు. అవసరమైతే అఖిలపక్ష సమావేశం నిర్వహించే అంశాన్ని కూడా పరిశీలించనున్నారు. ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు సన్నద్ధతకు ప్రాధాన్యం ఇస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
