CM Flag Off Ration Door Delivery Vehicles: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీ మేరకు రేషన్ సరుకుల డోర్ డెలివరీ విధానంపై కీలక అడుగు పడింది. ఇందులో భాగంగా గురువారం సీఎం జగన్ పౌరసరఫరాల శాఖ వాహనాలను ప్రారంభించారు.
విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి 2,500 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ వాహనాలు కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సేవలు అందించనున్నాయి. ఇక వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9,260 వాహనాలు ప్రారంభించారు. ఈ క్రమంలో శ్రీకాకుళంలో ఈ వాహనాలను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. ఇక కడప జిల్లాలో ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సీఎం ఆంజాద్‌బాషా వాహనాలకు పచ్చ జెండా ఊపారు. ఈ కొత్త విధానం కోసం ఉపయోగించనున్న 9,260 వాహనల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.539 కోట్లు ఖర్చు చేసింది. రేషన్ సరుకులు ఇంటికి డోర్ డెలివరీ చేసే క్రమంలో కల్తీ జరగడానికి ఎలాంటి ఆస్కారం లేకుండా అధికారులు పటిష్ట చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ప్రతీ బియ్యం బస్తాకు సీల్‌తోపాటు యూనిక్ కోడ్ ద్వారా ఆన్‌లైన్ ట్రాకింగ్ ఏర్పాటు చేయనున్నారు.