బంగారం పేరుతో కొత్త మోసం..తస్మాత్ జాగ్రత్త !

|

Oct 10, 2020 | 6:44 PM

బంగారం పేరుతో కొత్త మోసాలకు తెగబడ్డారు కంత్రీగాళ్లు. తక్కువ ధరకే పసిడి ఇస్తామని చెప్పి సాంతం దోచేస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఘరానా దొంగలు విజయవాడకు చెందినవారిని ఇదే తరహాలో మోసం చేసి పోలీసులకు దొరికిపోయారు.

బంగారం పేరుతో కొత్త మోసం..తస్మాత్ జాగ్రత్త !
Follow us on

బంగారం పేరుతో కొత్త మోసాలకు తెగబడ్డారు కంత్రీగాళ్లు. తక్కువ ధరకే పసిడి ఇస్తామని చెప్పి సాంతం దోచేస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఘరానా దొంగలు విజయవాడకు చెందినవారిని ఇదే తరహాలో మోసం చేసి పోలీసులకు దొరికిపోయారు. వివరాల్లోకి వెళ్తే… చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన స్టెల్లా అనే మహిళతో పాటు మరో నలుగురు హెర్బల్ ఉత్పత్తులు విక్రయించేవారు. తొమ్మిది నెలల క్రితం గుంటూరులో హెర్బల్ ప్రాడక్ట్స్ మేళా జరగ్గా.. అక్కడికి స్టెల్లా అండ్ బ్యాచ్ వెళ్లారు. అక్కడ అశోక్ అనే వ్యక్తి వీరికి కాస్త అమాయకుడిలా తారసపడ్డాడు. తమకు తమిళనాడులో 60 లక్షల విలువచేసే బంగారం దొరికిందని తక్కువ డబ్బులకు ఇస్తామని స్టెల్లా బ్యాచ్ అతడిని బురిడీ కొట్టించారు. ( Bigg Boss Telugu 4 : ఊహించని పరిణామం, హౌస్ నుంచి గంగవ్వ ఔట్ ! )

అశోక్ ఈ విషయాన్ని విజయవాడలో ఉండే తన ఫ్రెండ్ విజయభాస్కర్‌కు చెప్పాడు. ఇదంతా వాస్తవమే అని నమ్మిన అతడు మార్చి 7న తన భార్యతో కలసి చిత్తూరు జిల్లా పీలేరు వెళ్లాడు. అక్కడ స్టెల్లా బ్యాచ్ను కలిశాడు. మొదట రెండు బంగారు గుడ్లను విజయభాస్కర్‌కు ఆ గ్యాంగ్ ఇచ్చింది. ఆ గుడ్లను తిరుపతి తీసుకొచ్చి తెలిసిన గోల్డు షాపులో చూపించగా.. నిజమైన బంగారమే అని చెప్పారు. అదంతా బంగారం అని నమ్మిన విజయభాస్కర్ స్టెల్లా ముఠాకు 25 లక్షలు ఇచ్చి మొత్తం గోల్డ్ కొనుగోలు చేశాడు. ఆ తర్వాత విజయవాడ వెళ్లి మళ్లీ సరిచూసుకోగా నకిలీ బంగారం అని తేలింది. మోసపోయామని తెలుసుకొన్న బాధితుడుకి మరో దెబ్బ తగిలింది. ఈ క్రమంలోనే అతడికి కరోనా సోకింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయాడు. గత నెల 28న పీలేరు వచ్చి కంప్లైంట్ చేయగా.. పోలీసులు స్టెల్లాతో పాటూ చినబాబు, యుగంధర్, మురళి తోపాటు కేరళకు చెందిన రాధికలను అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్ నుంచి రూ.9 లక్షల నగదు స్వాధీనం చేసుకొన్నారు. ( పెళ్లి కాకుండానే బిడ్డకు జన్మనిచ్చిన 14 ఏళ్ల బాలిక )