కొండమీద కీరారణ్యంలో కోడి ఆకారంలో చర్చిని ఎవరు నిర్మించారు? ఎందుకు కట్టాల్సి వచ్చింది?

|

Dec 24, 2020 | 3:34 PM

కలలకేం అందరూ కంటారు.. కానీ వాటిని సాకారం చేసుకోవాలనే సంకల్పబలం మాత్రం కొందరికే ఉంటుంది. డేనియల్‌ అలామ్‌సజ అనే వ్యక్తికి బోలెడంత సంకల్పబలం ఉంది కాబట్టే తన కలల ప్రతిరూపం..

కొండమీద కీరారణ్యంలో కోడి ఆకారంలో చర్చిని ఎవరు నిర్మించారు? ఎందుకు కట్టాల్సి వచ్చింది?
Follow us on

కలలకేం అందరూ కంటారు.. కానీ వాటిని సాకారం చేసుకోవాలనే సంకల్పబలం మాత్రం కొందరికే ఉంటుంది. డేనియల్‌ అలామ్‌సజ అనే వ్యక్తికి బోలెడంత సంకల్పబలం ఉంది కాబట్టే తన కలల ప్రతిరూపం చికెన్‌ చర్చిని నేరవేర్చుకోగలిగాడు. దట్టమైన అడవిలో ఉన్న ఆ చర్చికి జనం క్యూలు కట్టేలా చేయగలిగాడు.. నిజానికి డేనియల్‌ అలామ్‌సజ దగ్గర చర్చి కట్టేంత డబ్బేమీ లేదు. కాని చర్చి కట్టాలన్న పట్టుదల మాత్రం పుష్కలంగా ఉండింది. జకార్తాలో ఉద్యోగం చేస్తున్న డేనియల్‌కు ఓ రోజు ఓ కలవచ్చింది. ఆ కలలో ప్రార్థనమందిరాన్ని నిర్మించమంటూ దైవ సందేశం వినిపించింది. కలే కదా అని అనుకున్నాడు. మరుసటి రోజు కూడా అదే కల వచ్చింది.

ఈసారి ఓ దట్టమైన అడవిలో కొండల మీద కోడి ఆకారంలో ఉన్న చర్చి కనిపించింది. అప్పట్నుంచి ప్రతిరోజూ కోడి ఆకారంలో ఉన్న చర్చి కలలోకి రావడం మొదలయ్యింది. ఇలా రోజూ కలలో చర్చి వస్తుండేసరికి ఎలాగైనా సరే చర్చిని నిర్మించి తీరాలనుకున్నాడు డేనియల్‌. ఈ గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత ఓ రోజు మగేలాంగ్‌ పట్టణానికి దగ్గరలో ఉన్న తన అత్తగారి ఊరికి బయలుదేరాడు. ఆ దారిలో కెంబాంగ్‌, కరంగ్‌జెరో గ్రామాల మధ్య ఉన్న రహ్మె కొండ ప్రాంతం ఎదురయ్యింది. అది చూసి డేనియల్‌ ఆశ్చర్యపోయాడు. కారణం అది తన కలలో కనిపించిన ప్రాంతం కావడమే! తరులు, గిరులు అన్ని అచ్చుగుద్దినట్టుగా తన కలలో కనిపించినట్టుగానే ఉండటంతో డేనియల్‌ తెగ సంబరపడిపోయాడు. రాత్రంతా అక్కడే ఉన్నాడు. రహ్మె కొండపై ప్రార్థనలు చేశాడు.

చర్చి నిర్మించాల్సిన ప్రదేశం అయితే దొరికింది. డబ్బే సమస్యగా మారింది. డేనియల్‌ డబ్బున్నవాడేం కాదు. అయినా ఏదైతే అది అవుతుందనే ధీమాతో నిర్మాణ పనులు మొదలు పెట్టాడు. ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టినా వెనుకంజవేయలేదు. నాలుగేళ్లలో రహ్మె కొండ మీద కోడి ఆకారంలో చర్చి వెలిసింది. డేనియల్‌ అనుకున్నది సాధించాడు. చర్చి గురించి నెమ్మదిగా ఇండోనేషియా అంతటా తెలిసిపోయింది. జనం చర్చికి క్యూలు కట్టడం మొదలు పెట్టారు. పెద్దగా సౌకర్యాలు లేకపోయినా, నిర్మాణం గొప్పగా లేకపోయినా ప్రజలు మాత్రం వస్తూనే ఉన్నారు. కోడి ఆకారణంలో చర్చి అన్న ఒక్క విశేషణమే ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.

కొన్నాళ్ల తర్వాత ఆ చర్చికి దివ్యశక్తి ఉందనే ప్రచారం మొదలయ్యింది. మద్యానికి, మాదకద్రవ్యాలకు అలవాటుపడినవారు, మతిస్థిమితం లేనివారు ఈ ప్రార్థనమందిరంలో కొన్ని రోజులు ఉంటే స్వస్థత చేకూరుతుందనే నమ్మకం పెరిగింది. దాంతో ఇతర దేశాల నుంచి కూడా పర్యాటకులు రావడం మొదలు పెట్టారు. ఒక్క నమ్మకమే కాదు ప్రశాంతత, ప్రకృతి సౌందర్యం వంటి అంశాలు కూడా టూరిస్టులను ఆకట్టుకునేట్టు చేస్తున్నాయి. పర్యవసానంగా చుట్టుపక్కల గ్రామాలకు ఆదాయం పెరిగింది. ఇంకో విషయమేమిటంటే ఇదేం క్రైస్తవ మతానికి సంబంధించిన మందిరం కాదు. బౌద్ధులు, ముస్లింలు కూడా వస్తారు. పెళ్లి వంటి శుభకార్యాలు కూడా జరుపుకుంటున్నారు. ఈ మందిరంలో మతం ప్రస్తావన అంతగా ఉండదు. చికెన్‌ చర్చ్‌గా, బర్డ్‌చర్చ్‌గా, చర్చ్‌డోవ్‌గా పాపులరైన ఈ మందిరాన్ని చూసుకుని డేనియల్‌ మురిసిపోతున్నాడు. ఈ జన్మకిది చాలనుకుంటున్నాడు. కలను సాకారం చేసుకున్నందుకు గర్వంగా ఉందంటున్నాడు..