చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో ఐదు పోలింగ్ కేంద్రాల పరిధిలో రీపోలింగ్‌కు ఈసీ ప్రకటన చేయడం తెలిసిందే. ఈ ఐదు ప్రాంతాలు టీడీపీకి గట్టి పట్టున్న ప్రాంతాలు కావడంతో అక్కడ వైసీపీ నేతల ప్రవేశానికి స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నార్ కమ్మపల్లిలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. వైసీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప స్థానిక ఎస్సీ కాలనీలో ప్రచారం నిర్వహించేందుకు ప్రయత్నించారు. వారిద్దరినీ పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు స్థానికులను కూడా పోలీసులు అడ్డుకున్నారు.
అలాగే.. తమ పొలాల్లోకి కూడా వెళ్లడానికి వీల్లేదంటూ స్థానికులు వైసీపీ నేతలను అడ్డుకున్నారు. కాగా.. గురువారం రాత్రి చెవిరెడ్డి తనయుడిని కూడా స్థానికులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. అటు.. ఊళ్లోకి అడుగుపెట్టేందుకు వీల్లేదని గ్రామస్తులు తెగేసి చెప్పడంతో చెవిరెడ్డి తీవ్ర ఆగ్రహంతో రగిలిపోయారు. ‘తిరుపతి వస్తారుగా.. అక్కడ చూసుకుంటా మీ సంగతి అంటూ హెచ్చరించారు.