విజయవాడలో సంచలనం రేపిన ఆయేషా మీరా హత్యకేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. మృతదేహానికి మళ్లీ రీపోస్టుమార్టం చేయాలని సీబీఐ నిర్ణయించింది. మృతదేహాన్ని పూడ్చిపెట్టి పదేళ్లు దాటిన నేపథ్యంలో ప్రస్తుతం ఎముకలు మాత్రమే ఉంటాయని మెడికల్ ఎక్స్‌పర్టులు సూచించారు. అయితే ఎముకలకి కూడా పోస్టు మార్టం చేస్తే ఒంటిపై ఉన్న గాయాలను గుర్తించవచ్చని సీబీఐ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆయేషా తల్లి శంషాద్ బేగంను సంప్రదించగా.. న్యాయం జరుగుతుందంటే మళ్లీ రీపోస్టు మార్టం చేయడానికి అభ్యంతరం లేదని ఆవిడ తెలిపారు. అయితే మళ్లీ పోస్టుమార్డం నిర్వహిస్తే ముస్లిం పెద్దల నుంచి వ్యతిరేకత లేకుండా కోర్టు నుంచి అనుమతి తీసుకోవాలని నిర్ణయించింది సీబీఐ.
మరోవైపు ఆయేషా తల్లిదండ్రులకి డీఎన్‌ఏ టెస్టులు నిర్వహించి శాంపిల్స్ సేకరించిన సీబీఐ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఉన్న ఆయేషా శాంపిల్స్‌తో తల్లిదండ్రుల డీఎన్ఏ సరిపోతుందా లేదా అనే దానిపై పరీక్షలు జరపనున్నారు. కాగా, హత్య జరిగినప్పుడు ఆయేషా ఒంటి పై తీసుకున్న శాంపిల్స్‌ను కానిస్టేబుల్ అప్పట్లో నాలుగు రోజులపాటు దాచేశారని గతంలో శంషాద్ బేగం చేసిన ఆరోపణల నేపథ్యంలో ఫోరెన్సిక్ ల్యాబ్‌లో ఉన్న శాంపిల్స్ ఆయేషావేనా కాదా అన్నది తేల్చే పనిలో సీబీఐ ఆధారాలు సేకరిస్తోంది.