అమరావతి ప్రాంత రైతులు రాజధాని విషయంలో చేస్తోన్న ఆందోళనల నేపథ్యంలో టీడీపీ నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి రాజధాని రైతులు చేస్తోన్న ఆందోళనల్లో పాల్గొన్నారు. రైతులతో కలిసి నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమం మధ్యలో అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతుగా తన వంతు విరాళాన్ని అందించారు భువనేశ్వరి. తన చేతికి ఉన్న బంగారం గాజు తీసి..రైతులకు ఇచ్చారు. ఈ సమయంలో అక్కడున్న టీడీపీ కార్యకర్తలు, రైతులు భావోద్వేగానికి గురయ్యారు. ఆ తర్వాత మాట్లాడిన చంద్రబాబు..ఆ గాజును బహిరంగంగా వేలంపాట వేసి, వచ్చిన డబ్బును అమరావతి ఉద్యమానికి ఉపయోగించాలని కోరారు. మందడం, ఎర్రబాలెం, కృష్ణాయపాలెం గ్రామాల్లో నారా భువనేశ్వరి పర్యటన సాగింది. కాగా నేటితో అమరావతి రైతుల ఉద్యమం 15వ రోజుకు చేరుకుంది.