ఫైజర్ కంపెనీ కరోనా వ్యాక్సిన్‌కి ఆమోదం తెలిపిన బ్రిటన్ సర్కార్.. వచ్చే వారంనుంచే పంపిణీ
కరోనా మహమ్మారి ఆటకట్టించేందుకు బ్రిటన్ రంగం సిద్ధం చేసుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఫైజర్-బయోఎన్‌టెక్ కరోనా వైరస్ వ్యాక్సిన్ వినియోగానికి..
కరోనా మహమ్మారి ఆటకట్టించేందుకు బ్రిటన్ రంగం సిద్ధం చేసుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఫైజర్-బయోఎన్‌టెక్ కరోనా వైరస్ వ్యాక్సిన్ వినియోగానికి బ్రిటన్ సర్కారు పచ్చజెండా ఊపింది. వచ్చే వారం నుంచే ప్రజలకు ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి తెస్తోంది. ఫైజర్-బయోఎన్‌టెక్ కరోనా వైరస్ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతించాలని మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) చేసిన సిఫార్సును బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించింది. వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి సాధించడంపై ఫైజర్ సీఈవో ఆల్బర్ట్ బౌర్లా సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సహకరించిన ఎంహెచ్ఆర్ఏకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. మరిన్ని దేశాల అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని, ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ నాణ్యత కల్గిన ఈ వ్యాక్సిన్‌లను అందజేస్తామని ఆయన వెల్లడించారు. బ్రిటన్‌లోని ఆసుపత్రులన్నీ వ్యాక్సిన్ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాయని, వచ్చే వారం నుంచే పంపిణీ ప్రారంభమవుతుందని బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రి మ్యాట్ హ్యాన్‌కాక్ చెప్పారు.