4th Test Impasse: క్రికెట్ ఆస్ట్రేలియాకు బీసీసీఐ అధికారిక లేఖ.. మ్యాచ్ జరగాలంటే ఆంక్షలు సడలించాల్సిందే !
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరిగే నాలుగో టెస్టు ఆడాలంటే టీమ్‌ఇండియా క్రికెటర్లకు విధించిన కఠిన క్వారంటైన్ నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియాను కోరింది బీసీసీఐ.
4th Test Impasse: ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరిగే నాలుగో టెస్టు ఆడాలంటే టీమ్‌ఇండియా క్రికెటర్లకు విధించిన కఠిన క్వారంటైన్ నిబంధనల్లో సడలింపులు ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియాను కోరింది బీసీసీఐ. దీనిపై అధికారికంగా లేఖ రాసింది. ఆస్ట్రేలియాకు వచ్చేముందు భారత జట్టు రెండు నగరాల్లో కఠిన క్వారంటైన్ అయ్యేందుకు ఒప్పందం చేసుకోలేదని తెలిపింది. దుబాయ్ నుంచి రాగానే సిడ్నీలో ఆటగాళ్లు ఐసోలేషన్‌కు వెళ్లారని గుర్తుచేసింది బీసీసీఐ. పర్యటనకు ముందు చేసుకున్న ఒప్పందంలోని అంశాలను బీసీసీఐ అత్యున్నత అధికారి సీఏ అధినేత ఎర్ల్ ఎడింగ్స్ దృష్టికి తీసుకొచ్చారు.
సిడ్నీ టెస్టు ముగిసిన తర్వాత టీమ్‌ఇండియా గబ్బా వేదికగా నాలుగో టెస్టు ఆడాల్సి ఉంది. జనవరి 15న ఇది ఆరంభమవుతుంది. అయితే బ్రిస్బేన్ నగరానికి చేరుకున్న వెంటనే ఆటగాళ్లంతా హోటల్ గదులకు మాత్రమే పరిమితం అవ్వాలని అక్కడి నిబంధనలు చెబుతున్నాయి. అయితే ఈ నిబంధనను క్రికెటర్లు అంగీకరించడం లేదు.
పర్యటనకు ముందు చేసుకున్న ఒప్పందంలో రెండు కఠిన క్వారంటైన్‌లు లేవని బీసీసీఐ వాదిస్తోంది. సిడ్నీలో టీమ్ఇండియా ఒక కఠిన క్వారంటైన్ పూర్తిచేసుకుంది. దీంతో ఇక ఆటగాళ్లు మరో క్వారంటైన్‌ను అంగీకరించేది లేదని చెబుతున్నారు. కలిసి భోజనం చేయాలని, కలిసి జట్టు సమావేశాలకు హాజరు కావాలని కోరుకుంటున్నారు. నిజానికి ఇది అంత పెద్ద డిమాండు కాదని బీసీసీఐ అధికారులు చెబుతున్నారు.
క్రికెట్ ఆస్ట్రేలియా కూడా హోటల్లో ఒకర్నొకరు కలుసుకోవచ్చని చెబుతోంది. అయితే ఒకే అంతస్తులోని వారు మాత్రమే కలుసుకోవాలి. ఇతర అంతస్తుల్లో ఉన్నవారు మిగతా వారిని కలవకూడదనే షరతు విధిస్తోంది. దీనినే టీమ్‌ఇండియా క్రికెటర్లు వ్యతిరేకిస్తున్నారు. నగరమంతా సాధారణ పరిస్థితులు ఉంటే హోటల్లో టీమ్‌ఇండియా మాత్రమే ఆంక్షలు పాటించడంపై ఇప్పటికే రహానె అసంతృప్తి వ్యక్తం చేశాడు. నాలుగో టెస్ట్ ఎక్కడ జరగాలనేది ఇప్పుడు క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.
Also Read :