భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇండియాకు రాకపోవచ్చు. దేశంలో మ్యుటెంట్ కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న దృష్ట్యా..ఆయన ఇండియా పర్యటన ఉండకపోవచ్చునని బ్రిటిష్ మెడికల్ అసోసియేషన్ కౌన్సిల్ అధ్యక్షుడు డాక్టర్ చాంద్ నాగ్ పాల్ అన్నారు. ప్రధాని ఇండియా విజిట్ పై బ్రిటన్ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవలసి ఉందని, ఏమైనా ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన పర్యటన అనుమానాస్పదమేనని చాంద్ నాగ్ పాల్ అభిప్రాయపడ్డారు. లండన్లోనూ, మరో నాలుగు ప్రాంతాల్లోనూ నాలుగంచెల లాక్ డౌన్ విధించినందున ఈ ఇన్ఫెక్షన్ అదుపులోకి వచ్చిన పక్షంలో అప్పుడు పరిస్థితిని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఇదే సమయంలో లాక్ డౌన్ ని మరికొంతకాలం పొడిగించే సూచనలు కూడా ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఇంగ్లండ్ లోని ఆసుపత్రుల్లో ఇదివరకటికన్నా కరోనా రోగుల సంఖ్య పెరిగిందని, చాలినన్ని పడకలు లేవని ఆయన తెలిపారు.
ఇలా ఉండగా ఈ స్ట్రెయిన్ కేసులు అప్పుడే సౌతాఫ్రికా, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా దేశాల్లోనూ కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని కొన్ని చోట్ల లాక్ డౌన్ విధించారు. సాధారణ వైరస్ కన్నా 70 శాతం ఎక్కువ ఇన్ఫెక్షన్ తో కూడినదని భావిస్తున్న ఈ వైరస్ ముప్పు నేపథ్యంలో బ్రిటన్ కు అనేక దేశాలు..ఇండియాతో సహా విమాన సర్వీసులను రద్దు చేశాయి.