పొలిటికల్ మిర్చి: బీజేపీకి అభ్యర్ధుల కొరత..
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీకి కాలం కలిసి వస్తున్నట్లు లేదు. తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నికల అంశం ఇప్పటికే పార్టీలో కాక రేపుతోంది. షెడ్యూల్ రావడంతోనే అభ్యర్ధిని ప్రకటించేసి..గులాబీదళం దూసుకుపోతుంటే… కాంగ్రెస్ పార్టీలో అభ్యర్ధి ఎంపిక అంశం నేతల మధ్య కుంపటి రాజేసింది. షెడ్యూలు విడుదల కాగానే పోటీకి సై అన్న బీజేపీకి కూడా ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. హుజూర్ నగర్ బరిలో దిగాలని భావించిన అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ […]
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీకి కాలం కలిసి వస్తున్నట్లు లేదు. తెలంగాణలో హుజూర్ నగర్ ఉప ఎన్నికల అంశం ఇప్పటికే పార్టీలో కాక రేపుతోంది. షెడ్యూల్ రావడంతోనే అభ్యర్ధిని ప్రకటించేసి..గులాబీదళం దూసుకుపోతుంటే… కాంగ్రెస్ పార్టీలో అభ్యర్ధి ఎంపిక అంశం నేతల మధ్య కుంపటి రాజేసింది. షెడ్యూలు విడుదల కాగానే పోటీకి సై అన్న బీజేపీకి కూడా ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది.
హుజూర్ నగర్ బరిలో దిగాలని భావించిన అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కమలం పార్టీకి షాక్ ఇచ్చారు. శంకరమ్మను పోటీలో నిలబెట్టి టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టాలని బీజేపీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. బీజేపీ ఎత్తులు ముందే గమనించిన గులాబీ నేతలు శంకరమ్మను బుజ్జగించి భవిష్యత్ పై భరోసా కల్పించడంతో శంకరమ్మ గులాబీకి జై కొట్టింది. దాంతో శంకరమ్మకు టీఆర్ఎస్ నామినేటెడ్ పదవి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
తాజా పరిణామాలతో ఖంగుతిన్న బీజేపీ కొత్త అభ్యర్ధి కోసం వేట మొదలెట్టింది. అనుకున్న అభ్యర్ధి హ్యాండివ్వడంతో ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ బీజేపీని దెబ్బ కొట్టిందనే వాదనలు వినిపిస్తున్నాయి. పేరుకే జాతీయ పార్టీ కానీ, ప్రాంతీయ పార్టీలకంటే బీజేపీ పరిస్థితి దారుణంగా ఉందని గుసగుసలు వినపడుతున్నాయి.