బీజేపీ ఎంపీ సుజనా చౌదరి మళ్లీ అదే మాట. గతంలో టీడీపీలో ఉండగా కేంద్రంలో బీజేపీ కలిసి ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా ఇప్పుడు బీజేపీలో కలిసిపోయిన తర్వాత కూడా అదే మాట మాట్లాడారు. జగన్ వందరోజుల పాలనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా రాదని, అది ముగిసిన అధ్యామని మరోసారి చెప్పారు. ప్రత్యేక హోదా అంటే కేంద్రంతో వైరం పెంచుకోవడమేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాజీలేని పోరాటం చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎంపీ సుజనా.
అధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే జగన్ 110 తప్పులు చేశారని ఆరోపించారు సుజానా చౌదరి. ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన పోస్టులన్నీ ఒకే సామాజిక వర్గానికి ఇస్తున్నారని మండిపడ్డారు. అమరావతి భూములపై తన సవాల్‌ను స్వీకరించే దమ్ము వైపీపీ ప్రభుత్వానికి లేదన్నారు. వందరోజుల్లో చాలమంది పారిశ్రామిక వేత్తలు వెనక్కి వెళ్లిపోయారని, పోలవరం ప్రాజెక్టు పనులను ఆపేయడం ప్రభుత్వ విజయమా అంటూ ప్రశ్నించారు.
వరదలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలు విఫలమయ్యాయని, అదే విధంగా ఇసుక పాలసీ తీసుకురావడంతో ఆర్ధిక వ్యవస్థ స్థంభించిపోయిందని ఆరోపించారు సుజనా చౌదరి. ఇక కాపు కార్పొరేషన్‌కు నిధులు కేటాయించినా లబ్దిదారులకు అందడం లేదని విమర్శించారు. పాలన విషయంలో గత టీడీపీ అనుసరించి విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తోందంటూ చెప్పారు ఎంపీ సుజనా చౌదరి.