మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు..ఫలితాలు ఆశించినట్లు లేవని దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పలేదు. డిసెంబర్ 1న ఆరు సీట్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువెడ్డాయి. బీజేపీ కేవలం ఒక స్థానంలో గెలుపొందింది. పాలక శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి 4 సీట్లను...
మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పలేదు. డిసెంబర్ 1న ఆరు సీట్లకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువెడ్డాయి. బీజేపీ కేవలం ఒక స్థానంలో గెలుపొందింది. పాలక శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి 4 సీట్లను తమ ఖాతాలో వేసుకుంది. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించాడు. పాలక భాగస్వామ్య పార్టీల్లో ఎన్సీపీ, కాంగ్రెస్ చెరో రెండు సీట్లకు, శివసేన ఒక స్థానానికి పోటీ చేశాయి. బీజేపీ 4 స్థానాలకు పోటీ చేయగా, మరో సీటులో స్వతంత్ర అభ్యర్థి పోటీ చేశాడు.
నాగ్‌పూర్ స్థానాన్ని కాంగ్రెస్ అభ్యర్థి అభిజిత్ గెలుచుకోగా…. పుణేలో ఎన్సీపీ క్యాండిడేట్ పాగా వేశాడు. ఏడాది కాల మహావికాస్ అఘాడీ ప్రభుత్వానికి, విపక్ష బీజేపీకి మధ్య ఇవి తొలి ఎన్నికలు. ఈ ఎన్నికలను సీఎం ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ ప్రభుత్వానికి, విపక్ష బీజేపీకి మధ్య ప్రెస్టీజియస్ బ్యాటిల్ లా పరిగణించారు. ఐతే దాదాపు 90 శాతం ప్రజలు మహాకూటమికే జై కొట్టడం విశేషం. ఈ ఎన్నికల్లో 12 లక్షలమందికి పైగా గ్రాడ్యుయేట్లు, టీచర్లు పాల్గొన్నారు.
మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత పాటిల్ సహా పలువురు పార్టీ నేతలు ముఖ్యంగా పూణే నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశారు. కానీ అది ఫలించలేదు. ప్రజలు కూటమికే ఓటేశారు. మంచి పట్టు ఉన్న పట్టభద్రుల నియోజకవర్గాలను బీజేపీ కోల్పోవడం విశేషం.
ముఖ్యంగా నాగపూర్ విషయానికి వస్తే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, దేవేంద్ర ఫడ్నవీస్ తండ్రి గంగాధరరావు ఫడ్నవీస్ ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ ఫలితాలు తాము ఆశించినట్టు లేవని దేవేంద్ర ఫడ్నవీస్ అంగీకరించారు. ఎక్కువ సీట్లు వస్తాయని భావించామని, కానీ ఒక్క సీటే గెలిచామన్నారు. మూడు పార్టీల మహా వికాస్ అఘాడీ శక్తిని అంచనా వేయలేకపోయామని వ్యాఖ్యానించారు.