బిగ్ బాస్ తెలుగు సీజన్ 4కు వ్యాఖ్యాత ఎవరు.? ఇప్పుడు అందరిలోనూ మెదులుతున్న ప్రశ్న ఇదే. ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ముఖ్యంగా మూడో సీజన్ అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహరించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్4 కోసం నిర్వాహకులు మరోసారి జూనియర్ ఎన్టీఆర్‌ను వ్యాఖ్యాతగా తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే మూడో సీజన్ అధిక టీఆర్పీ రావడానికి అక్కినేని నాగార్జున యాంకరింగ్ ముఖ్య కారణమని చెప్పొచ్చు. మన్మధుడు హోస్టుగా మెప్పించినా.. షో నిర్వాహకులు మాత్రం మరోసారి జూనియర్ ఎన్టీఆర్ వైపే మొగ్గు చూపుతున్నారని సమాచారం. తెలుగులో బిగ్ బాస్ మొదటి సీజన్‌కు ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సీజన్ అంతటా తనదైన శైలి యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఎన్టీఆర్ విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఇక దీనిని దృష్టిలో పెట్టుకుని షో నిర్వాహకులు బిగ్ బాస్ 4 కోసం ఎన్టీఆర్‌తో సంప్రదింపులు జరపాలని చూస్తున్నారట. అంతేకాకుండా డబుల్ రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా సిద్దమయ్యారని సమాచారం. మరి ఈ బంపర్ ఆఫర్‌కు ఎన్టీఆర్ ఒప్పుకుంటాడో లేదో వేచి చూడాలి.