అమెరికా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ వైట్ హౌస్ అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీగా ఇండియన్-అమెరికన్ వేదాంత్ పటేల్ ను నియమించారు. బైడెన్ శిబిరంలో పటేల్ సీనియర్ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఆయన ప్రచారవర్గంలో రీజనల్ కమ్యూనికేషన్ డైరెక్టర్ గాను, అంతకుముందు నెవాడా-వెస్టర్న్ ప్రైమరీ స్టేట్స్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ గా, ఒకప్పుడు ఇండియన్-అమెరికన్ కాంగ్రెస్ ఎంపీ ప్రమీలా జయపాల్ కు కూడా ఇదే హోదాలో డైరెక్టర్ గా ఆయన వ్యవహరించారు. ఇండియాలో పుట్టి కాలిఫోర్నియాలో పెరిగిన వేదాంత్ పటేల్.. ఫ్లోరిడా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా అందుకున్నారు.
వైట్ హౌస్ కమ్యూనికేషన్స్, ప్రెస్ స్టాఫ్ కోసం బైడెన్ ప్రకటించిన 16 మందిలో పటేల్ ఒకరు. ఈ టీమ్ అంతా వారివారి రంగాల్లో ప్రతిభగాలవారని వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రాన్ తెలిపారు. క్రియేటివ్ కమ్యూనికేషన్స్ లో వీరి మేధస్సు అపారమన్నారు. ఇలా ఉండగా బైడెన్ ఇలా తనకు నచ్చిన వారందరినీ వైట్ హౌస్ స్టాఫ్ గా నియమించుకుంటున్నారు గానీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తను ఇప్పుడప్పుడే శ్వేత సౌధాన్ని వీడేది లేదని ఘంటాపథంగా చెబుతుండడంతో బైడెన్ వర్గం అయోమయంలో పడుతోంది. అధ్యక్ష ఎన్నికను సవాలు చేస్తూ ట్రంప్ వేసిన దావాలు ఇంకా కొన్ని కోర్టుల్లో నలుగుతున్నాయి. జనవరి మూడో వారంలో బైడెన్ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అప్పటికైనా పరిస్థితి మారుతుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.