తలైవా పొలిటికల్ ఎంట్రీ తమిళనాట కాకరేపుతోంది. తమిళనాట రజినీ పొలిటికల్ ఎంట్రీ.. ఫ్యాన్స్‌కి పెద్ద పండుగే. ఆయన వస్తే ఏదో చేస్తాడని అంతా నమ్ముతున్నారు. బ్లాక్ బ్లస్టర్ మూవీస్ ద్వారా తమిళ ప్రజలకు తలైవాగా మారిన రజినీకాంత్ పక్కా ప్లాన్‌తో ముందుకెళ్తున్నారు. మరోవైపు, కొత్త పార్టీ ప్రకటన ఎప్పుడు.. సింబల్ ఏంటీ..? రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది.
బాబా మూవీలో వేలిముద్ర డైలాగ్స్‌తో ప్రజలకు చేరువైన తలైవా…అదే సింబల్ గుర్తుగా ఉంటే కలిసొస్తుందనే టాక్ వినిపిస్తోంది. రజినీ యోగముద్రకోసం ఈసీ దగ్గర కూడా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. తమిళనాడులో బాబా పోస్టర్ స్టిల్‌తో ఉండే ఫ్యాన్స్ సంఘాలు, అనేక హోటళ్లలో రజినీ వేలి ముద్ర గుర్తులు కనిపిస్తున్నాయి. ప్రజలకు చేరువైనా ఈ గుర్తు పార్టీ సింబల్‌గా ఉంటే …ఇక గెలుపు తమదేనన్న వార్తలు రజినీ సన్నిహిత వర్గాల్లో వినిపిస్తోంది.
మరోవైపు, అన్నామలై చిత్రం గెటప్‌ను తలపించే విధంగా సైకిల్, పాల క్యాన్‌తో ఉండే రజినీ స్టైల్ సింబల్ కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. పార్టీ ప్రకటనకు కేవలం 20 రోజులే ఉండటంతో పార్టీపేరు, గుర్తు, జెండా విషయంపై పార్టీ ముఖ్యులు అర్జున్‌మూర్తి, తమిళరవి మణియన్..మక్కల్ మండ్రం జిల్లాల కార్యదర్శలతో భేటీ అయ్యారు. గంటల తరబడి చర్చించినట్టు తెలుస్తోంది.
పార్టీ చిహ్నంగా సైకిల్‌ను ఎంచుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే, సైకిల్ చిహ్నం విషయంగా ఏదేని అభ్యంతరాలు, వివాదాలు తలెత్తే అవకాశాలు ఉండవచ్చన్న భావనతో అందుకు కొన్ని మెరుగులుదిద్దారు. రజనీ నటించిన అన్నామలై చిత్రంలో సైకిల్, పాల క్యాన్ గెటప్ అభిమానుల్ని అలరించింది. ప్రస్తుతం ఇదే ఆ పార్టీకి చిహ్నంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సైకిల్, పాలక్యాన్‌తో రజనీ గెటప్ తరహాలో చిహ్నంపై దృష్టి పెట్టినట్టు తెలిస్తోంది. మక్కల్ మండ్రం నిర్వాహకులు జెండా, చిహ్నం విషయంగా తమ అంగీకారం తెలిపినా, తుది నిర్ణయం రజనీకాంత్ తీసుకోవాల్సి ఉందని ఆ మండ్రం నిర్వాహకులు పేర్కొంటున్నారు.
వచ్చే యేడాది తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో కబాలి 31 జిల్లాల అభిమాన సంఘాలతో వరుసగా భేటీ అవుతున్నారు. తన సన్నిహితులతోనూ పార్టీ ఏర్పాటుపై కీలక చర్చలు చేసినట్టు సమాచారం. రజినీకాంత్ జనవరిలో పార్టీ ఆవిర్భావ వేడుకలకు సిద్ధమవుతున్నట్టు తమిళ మీడియా కోడై కూస్తోంది. దక్షిణ తమిళనాడులో బలమైన కేడర్ ఉండటంతో మధురైలోనే పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని ప్లాన్ చేశారు. అక్కడ సభకు కూడా ఏర్పాట్లు జరిగిపోతున్నట్టు తెలుస్తోంది. వర్చువల్ ద్వారా ప్రజలకు మరింత చేరువయ్యే యోచనలో రజినీకాంత్ ఉన్నారు. మూడుకోట్ల మంది తమిళ ప్రజలకు దగ్గరవ్వాలంటే ప్రస్తుత పరిస్థితుల్లోవర్చువల్ ద్వారానే సాధ్యమని సన్నిహితులతో చర్చించినట్టు సమాచారం.
శనివారం రజినీకాంత్ బర్త్‌డే సెలబ్రేషన్ ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు పెద్దయెత్తున సంబరాలకు సిద్ధమవుతున్నారు. అటు తిరువణ్ణామలైలో రజినీ పార్టీకోసం ఫ్యాన్స్ యాగాలు చేశారు. ఈ యాగంలో రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. అయితే, తలైవా తిరువణ్ణామలై నుండే పోటీచేయాలనే అభిమానులు కోరుతున్నట్టు సమాచారం. అక్కడి నుంచి పోటీచేస్తే…కబాలి గెలుపు ఖాయమని చెబుతున్నారు.
మరోవైపు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బలమైన కేడర్ సెలక్షన్‌పై కబాలి దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. వివిధ జిల్లాలకు అధ్యక్షులు, కార్యదర్శులు, ఇతర కార్యవర్గంపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. మొత్తానికి రజినీ అంటే చెప్పిందే చేస్తాడు…చేసేదే చెబుతాడు అనే టాక్ తమిళనాట వినిపిస్తోంది. ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. రజినీ రాజకీయ ప్రవేశంతో…ఏకంగా సమీకరణాలే మారవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయ్.