ఖాతాదారులకు ఊరట..బ్యాంకుల సమ్మె వాయిదా..

|

Mar 02, 2020 | 8:56 AM

ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు తలపెట్టిన బ్యాంకుల సమ్మె వాయిదా పడింది. ఈ మేరకు సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఆల్‌‌‌‌ ఇండియా బ్యాంక్‌‌‌‌ ఎంప్లాయీస్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ (ఏఐబీఈఏ) ప్రకటించింది. చర్చలు సానుకూలంగా జరుగుతున్నందున సమ్మె ఆలోచన వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. అయితే..

ఖాతాదారులకు ఊరట..బ్యాంకుల సమ్మె వాయిదా..
Follow us on

ఖాతాదారులకు శుభవార్త… ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు తలపెట్టిన బ్యాంకుల సమ్మె వాయిదా పడింది. ఈ మేరకు సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ఆల్‌‌‌‌ ఇండియా బ్యాంక్‌‌‌‌ ఎంప్లాయీస్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ (ఏఐబీఈఏ) ప్రకటించింది. చర్చలు సానుకూలంగా జరుగుతున్నందున సమ్మె ఆలోచన వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. వేతన సవరణతో పాటు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ బ్యాంక్ అధికారులు, సిబ్బంది, అధికారులు మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే..

వరుస సెలవుల మధ్యలో బ్యాంక్ అధికారులు సమ్మెకు పిలుపునివ్వడంతో దాదాపు ఆరు రోజుల పాటు దేశంలో బ్యాంకింగ్ సేవలు స్తంభించే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ (ఐబీఎ) అధికారులు యునైటెడ్ ఫోరమ్ బ్యాంక్ యూనియన్ (యుఎఫ్‌బియు) నాయకులతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా బ్యాంక్‌ సిబ్బందికి 15 శాతం వేతన పెంపునకు ఐబిఎ సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా సమాచారం. దీనికి తోడు వివిధ ఇతర సమస్యలకు కూడా ఐబిఎ సానుకూలతను వ్యక్తం చేయడంతో యూఎఫ్‌బియు తన సమ్మెను వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్టుగా యూనియన్‌ అధికారులు తెలిపారు.

ముంబయిలో వివిధ ఉద్యోగుల సంస్థలు ఐబీఏతో సమావేశమయ్యాయని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో, వారానికి ఐదు రోజులు మాత్రమే పని దినాలతోపాటు, జీతం 15 శాతం పెంచడం వంటి అంశాలపై చర్చించారు. పనితీరు బాగున్న బ్యాంకుల్లో నిర్వహణ లాభాల్లో నాలుగు శాతాన్ని ఉద్యోగులకు ప్రోత్సాహకంగా ఇచ్చేందుకు అంగీకరించడం తోపాటు వివిధ సంస్థలు లేవనెత్తిన సమస్యలపై చర్చించడానికి ఐబీఏ అంగీకరించింది. దీంతో సమ్మె వాయిదా పడింది. కాగా 15 శాతం వేతన పెంపుతో బ్యాంకులపై ఏడాదికి సుమారు రూ.8,000 కోట్ల భారం పడనుంది. అలాగే రూ.80,000 జీతం ఉన్న బ్యాంకు ఉద్యోగికి ఏడాదికి రూ.40 నుంచి రూ.50 వేల లాభం చేకూరనుందని అంచనా వేస్తున్నారు.